మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. మరో ఐదుగురికి శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మేడ్చల్ కోర్టు తీర్పు.. ఎనిమిది కేసుల పరిష్కారం

మేడ్చల్, నవంబర్ 12 (ప్రతిపక్షం): మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో మరో ఐదుగురికి జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఘటనలకు సంబంధించి మొత్తం ఎనిమిది కేసులను గురువారం మేడ్చల్‌లోని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కమ్-7వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారించి పరిష్కరించారు.

వీటిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన రెండు కేసుల్లో నిందితులకు రూ.2 వేల జరిమానా విధించారు. మరో ఆరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.4,500 జరిమానాతో పాటు ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒకరికి 10 రోజుల జైలు శిక్ష, మరో నలుగురికి నాలుగు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది.

ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

Related News

Latest News