నాతో చర్చ తర్వాత మోదీ ఇక ప్రధానిగా ఉండలేరు: రాహుల్

ప్రతిపక్షం, నవంబర్ 13: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. తనతో నేరుగా చర్చకు మోదీ ముందుకు వస్తే ఆయన ప్రధానిగా కొనసాగడం కష్టమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం చర్చకు రావాల్సిన అనేక కీలక అంశాలు ఉన్నాయని, వాటిపై ప్రధానితో నేరుగా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ ఆరోపణలు, చైనాతో సరిహద్దు వివాదం, జనరల్ నరవణే రాసిన పుస్తకం, ఎప్‌స్టీన్ వ్యవహారం వంటి అంశాలపై పార్లమెంటులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. సభలో చర్చకు అవకాశం కల్పిస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ, తాను మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైక్రోఫోన్‌ను సైతం ఆపివేస్తున్నారని విమర్శించారు.

తనకు సుదీర్ఘ ప్రసంగాలతో కూడిన చర్చ అవసరం లేదని, ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కూర్చొని పరస్పరం ప్రశ్నలు సంధించుకునే విధంగా ముఖాముఖి చర్చ జరగాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. ఒక టేబుల్‌కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరోవైపు తాను కూర్చుంటామని, మోదీ తనపై ఆరోపణలు చేస్తే తాను కూడా ప్రధానిపై ప్రశ్నలు సంధిస్తానని పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆసక్తిగా గమనించే అంశాలపై ఇద్దరూ నేరుగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చకు మధ్యవర్తిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను మధ్యవర్తిగా పెట్టినా అంగీకరిస్తానని తెలిపారు. ప్రధానితో బహిరంగ చర్చ జరగాలంటూ రాహుల్ గతంలోనూ పలుమార్లు సవాల్ విసిరారు. మోదీని దేశద్రోహిగా నిరూపించడానికి తనకు ఐదు నిమిషాలు సరిపోతాయని గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయితే రాహుల్ గాంధీ తాజా సవాల్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో చర్చలకు దూరంగా ఉంటున్నది రాహుల్ గాంధీయేనని వారు విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, చర్చ కోసం ప్రధానమంత్రి వేదికను ఎంచుకోవాలని రాహుల్ కోరుతున్నారని, అయితే పార్లమెంటే చర్చలకు అత్యంత సముచితమైన వేదిక అని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ మరింత బాధ్యతాయుతంగా, గంభీరంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో ప్రధానితో ముఖాముఖి చర్చకు రాహుల్ చేసిన సవాల్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కీలక జాతీయ అంశాలపై నేరుగా చర్చ జరగాలని ప్రతిపక్ష నాయకుడు కోరుతుండగా, మరోవైపు పార్లమెంటులోనే చర్చించేందుకు అవకాశం ఉందని అధికార పక్షం చెబుతోంది. ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

Related News

Latest News