జాతీయస్థాయి కవితా పోటీలో మెరిసిన లక్ష్మీదేవిపల్లి విద్యార్థిని
‘నీరు’ కవితకు అరుదైన గుర్తింపు.. దండు అక్షయకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం
విద్యార్థినిలోని సాహిత్య ప్రతిభను వెలికి తీసిన తెలుగు ఉపాధ్యాయుడు మహేంద్రా రెడ్డి
ప్రతిపక్షం, నంగునూరు/నారాయణరావుపేట, నవంబరు 13: చిన్న వయసులోనే తన కలానికి పదును పెట్టి, ప్రకృతి ప్రాధాన్యతను అక్షరాల్లో ఆవిష్కరించిన ఓ విద్యార్థిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నీటి ఆవశ్యకత, వ్యవసాయంతో దాని అనుబంధం, ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని హృద్యంగా కవిత్వీకరించిన దండు అక్షయ జాతీయ స్థాయి కవితా పోటీలో ఎంపికై పాఠశాలకు, గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచింది. సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న దండు అక్షయకు ఈ అరుదైన అవకాశం దక్కింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాహిత్య పోటీల్లో భాగంగా వివిధ సాహిత్య ప్రక్రియల్లో విద్యార్థుల నుంచి రచనలు ఆహ్వానించారు. ఈ పోటీల్లో అక్షయ రాసిన ‘నీరు’ అనే కవిత ఎంపికై ప్రశంసలు అందుకుంది.
నీటి విలువను చాటిన అక్షరాలు!
నీరు కేవలం ప్రకృతి ప్రసాదించిన వనరు మాత్రమే కాదు.. సమస్త జీవకోటికి జీవనాధారం, వ్యవసాయానికి ఆయువుపట్టు అనే సందేశాన్ని అక్షయ తన కవితలో అద్భుతంగా ఆవిష్కరించింది. బోర్లు, బావులు, నదులు, ప్రాజెక్టులు, చెరువులు, కాలువల ద్వారా ప్రవహించే నీరు పంటలకు, పచ్చని ప్రకృతికి, రైతన్నల బతుకులకు ఎంతటి ఆధారమో కవితా రూపంలో వివరించింది. అదే సమయంలో అకాల వర్షాలు, వరదలతో రైతులు ఎదుర్కొనే కష్టాలను, అప్పుల బాధలను, నీటి వల్ల కలిగే నష్టాలను కూడా తన కవితలో ప్రతిబింబించింది. నీరు జీవనాధారమే కాదు.. ప్రకృతి ప్రకోపిస్తే కన్నీటికి కూడా కారణమవుతుందనే వాస్తవాన్ని నీరు అనే కవితలో…
*నీరు*
ప్రాణికోటికి జీవనాధారం
వ్యవసాయానికి ఆధారం
పంటలకు ప్రాణాధారం
జగతికి మూలాధారం
బోరులైనా , బావులైనా
నదులైనా , ప్రాజెక్టులైనా
చెరువులైనా, కాలువలైనా
పారేది పంటల కొరకే
పచ్చని ప్రకృతి కొరకే
కూలీల పనుల కొరకే
రైతన్నల బాగు కొరకే
తప్పు దారిలో వచ్చిన వాన
తిప్పలు రైతుకు చానా
నిప్పైతుంది నీరు
నిలువునా ముంచుతోంది నీరు
కన్నీరు కారిస్తుంది నీరు
కడలిని ముంచెత్తుతుంది నీరు
అంటూ సరళమైన పదాలతో, సామాజిక స్పృహతో వ్యక్తీకరించింది. బాల్యంలోనే ఇంతటి ఆలోచనాత్మకమైన కవితను రచించడం విశేషంగా నిలిచింది.
ఈ నెల 22వ తేదీన పురస్కార ప్రదానం
జాతీయస్థాయిలో ఎంపికైన దండు అక్షయకు ఈ నెల 22వ తేదీన తెలంగాణ సారస్వత పరిషత్తులో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రూ.500 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేయనున్నారు. చిన్నారి సాహిత్య ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మండల విద్యాధికారి ఎం.గౌరీ మోహన్, పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎ.శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ పోతుల రమేశ్, ఏఏపీసీ చైర్మన్ మేకల ప్రమీలతో పాటు ఉపాధ్యాయ బృందం అక్షయను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినికి మార్గదర్శకత్వం వహించి, కవితా రచన పట్ల ఆసక్తిని పెంపొందించిన తెలుగు ఉపాధ్యాయుడు పిన్నింటి మహేంద్రారెడ్డిని అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు సరైన ప్రోత్సాహం లభిస్తే జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటగలరనే దానికి దండు అక్షయ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. పుస్తకాల్లోని పాఠాలకు పరిమితం కాకుండా సమాజం ఎదుర్కొనే సమస్యలను అక్షరాల్లో పలికించిన ఈ బాల కవయిత్రి మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.





























