పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

*నల్గొండలో 4259 కొత్త చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి.

  • ఈ నెల 19 నుండి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ .

*త్వరలో పెన్షన్ రూ.4000లకు పెంపు – ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం.

*జిల్లాలో 27,255 మందికి కొత్త పెన్షన్లు మంజూరు – కలెక్టర్ చంద్రశేఖర్.

*మామిళ్లగూడెం వద్ద పేదలకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు.

*ఉచిత బస్సు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఘనత చరిత్రలో నిలుస్తుంది.

*రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 13: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…

ఒక్క నల్లగొండ జిల్లాలోనే దాదాపు 27 వేల కొత్త పింఛన్లు మంజూరు కావడం జిల్లా ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నారు. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఒంటరి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు ఆసరాగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం నూతన చేయూత పింఛన్లను మంజూరు చేయడం పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

దేశ మాజీ ప్రధాని, దివంగత శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ నిధులను జమ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తెలిపారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయం నుండే పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసిన ఘనత చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

నల్గొండ పట్టణంలోని పేదవారి కోసం దేవరకొండ రోడ్‌లోని మామిళ్లగూడెం వద్ద ఇందిరమ్మ టవర్స్ పేరుతో 480 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకతీతంగా కేవలం పేదవారికే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

రాబోయే కాలంలో ప్రభుత్వం పెన్షన్ల మొత్తాన్ని రూ.4000/-లకు పెంచే అవకాశం ఉందని, ఈ విషయంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పెన్షన్లు రానివారు బాధపడకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన తాను, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తానని, ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలు తన వద్దకు రావచ్చని తెలిపారు.

పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా ప్రజల తరపున మంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

*మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…

పెన్షన్లు పేదవారికి ఆర్థిక భరోసా, ఆత్మగౌరవం అని అన్నారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో కొత్త పెన్షన్ల కోసం 2430 దరఖాస్తులు వస్తే, క్షేత్రస్థాయిలో పరిశీలించి 2036 మందికి అర్హత కల్పించామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

*ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ…
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం చేయూత పెన్షన్లు ఇస్తోందని, ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నామన్నారు.

*మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…
రాష్ట్రంలో 40 లక్షల పెన్షన్లను ప్రభుత్వం ఇస్తోందని, దీని ద్వారా పేదలకు సామాజిక భద్రత కల్పిస్తున్నామని, ఈ నెల 19 నుండి కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.

*జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ…

నల్గొండ జిల్లాలో ప్రతి నెల 1,97,262 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, కొత్తగా 5 కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి 27,255 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. అందులో నల్గొండ నియోజకవర్గంలోనే 4,259 కొత్త పెన్షన్లు ఉన్నాయని, నెలకు రూ.2016 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related News

Latest News