- సర్పంచ్ భవాని నవీన్ కుమార్
ప్రతిపక్షం, నంగునూరు/చిన్నకోడూరు, నవంబర్ 13: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని చిన్నకోడూరు మండలం రామంచ సర్పంచ్ భవాని నవీన్ కుమార్ అన్నారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే ప్రోత్సాహం అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో దాత నాగప్రసాద్ రూ.7,500 ఆర్థిక సహాయంతో యూకేజీకి చెందిన 25 మంది చిన్నారులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. విద్యార్థులందరికీ మిఠాయిలు అందజేసి బాలల దినోత్సవ వేడుకల్లో ఆనందాన్ని నింపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భవాని నవీన్ కుమార్ మాట్లాడుతూ.. రామంచ ప్రాథమిక పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ ఉపాధ్యాయుల సూచనలు పాటించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని చిన్నారులకు సూచించారు.
దాత నాగప్రసాద్ అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్తవ్వ సూచించారు. విద్యార్థుల అభ్యున్నతికి దాతలు అందించే ప్రతి సహకారం పాఠశాలల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. దాత నాగప్రసాద్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు చేపట్టడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రామంచ పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులోనూ తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అంతకు ముందు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవ ప్రాముఖ్యతను, బాలల హక్కులు, విద్య ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాంసాని వెంకట సురేశ్ కుమార్, ఉపాధ్యాయులు సునీత, అబేదా బేగం, వరప్రసాద్, స్వరూప, స్వప్న, కళ్యాణి, రమ్య, సిబ్బంది లావణ్య, పోచవ్వ తదితరులు పాల్గొన్నారు.





























