రోస్టర్ విధానాన్ని సవరించాలి.. సామాజిక న్యాయం కల్పించాలి

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలి – మాలల హక్కుల సాధన సమితి

ఏడుపాయల వద్ద మాలలకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 13: రాష్ట్రంలో అమలవుతున్న రోస్టర్ పాయింట్ల విధానాన్ని సవరించి అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మల మైసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానంలో మార్పులు చేసే వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని కోరారు.ఈ మేరకు బొమ్మల మైసయ్య ఆధ్వర్యంలో సమితి రాష్ట్ర, జిల్లా నాయకులు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులు, పోలీసు శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. అదేవిధంగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మాల సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరగా, మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రతి మండలానికి అంబేద్కర్ భవన్ కేటాయించాలని, గ్రామాలు, పట్టణాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు కల్పించాలని కోరారు. తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, ఉద్యోగ అవకాశాలు, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని బొమ్మల మైసయ్య కోరారు. నాయకులు ప్రస్తావించిన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమితి నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాల ఎల్లం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాల విటల్, మెదక్ జిల్లా అధ్యక్షుడు పోతరాజు కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పాలేటి స్వామి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు నరసన్నగారి నర్సింహులు, మాసాయిపేట మండల అధ్యక్షుడు కత్తెర యాదగిరి, నార్సింగి మండల ఉపాధ్యక్షుడు గర్జల స్వామి, రామాయంపేట మండల ఉపాధ్యక్షుడు జక్కుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు దోసెల కార్తీక్, సివిల్ ఇంజనీర్ దొమ్మాట రవీందర్, నర్సాపూర్ తాలూకా అధ్యక్షుడు నీరుడు కృష్ణ, పాపన్నపేట మండల అధ్యక్షుడు బ్యాగరి లక్ష్మణ్, నాగసానిపల్లి సర్పంచ్ దండేపు దుర్గయ్య, చిన్నశంకరంపేట మండల ఉపాధ్యక్షుడు కలకంటి బాబు, యువజన సభ్యులు దుంపల యశ్వంత్, పోతరాజు నరేష్, గర్జల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News