ప్రతిపక్షం, నవంబర్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకానికి సంబంధించి కీలక మార్గదర్శకాలను స్పష్టం చేసింది. ఒక కుటుంబంలో ఒక్కరే సంపాదించే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి నేరుగా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతూ ఆదాయం సంపాదిస్తున్న కుటుంబాల్లో మాత్రం ఎవరి పేరుతో బీమా తీసుకోవాలనే విషయాన్ని కుటుంబ సభ్యులే నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. కుటుంబ అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీమా పొందే వ్యక్తిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించినట్లు తెలుస్తోంది.
ఈ పథకంలో నామినీల ఎంపికకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బీమా పొందే వ్యక్తి తనకు నచ్చిన ఒకరిని లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అంగీకారంతో నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక కుటుంబంలో పలువురు సంపాదనపరులు ఉన్నప్పుడు బీమా ఎవరికి తీసుకోవాలనే విషయంలో కుటుంబమే తుది నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందిరమ్మ బీమా పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో దండోరా వేయించి పథకానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయనుంది. బీమా ఎవరికి వర్తిస్తుంది, కుటుంబంలో సంపాదించే వారు ఎంతమంది ఉన్నా ఎవరిని ఎంపిక చేసుకోవచ్చు, నామినీలను ఎలా నిర్ణయించుకోవచ్చు వంటి అంశాలను వివరించనుంది. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ బీమా పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రారంభంతో అర్హులైన కుటుంబాలకు బీమా భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.





























