ప్రతిపక్షం, నవంబర్ 14: హైదరాబాద్ పరిధిలోని ఆటో కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు నివాస భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆధునిక గృహాలను నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో మొత్తం రెండు వేల ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఇళ్లను అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ నిర్మాణాల కోసం సుమారు రూ.220 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోందని పేర్కొన్నారు.
తొలి విడతలో నాలుగు ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం రెండు వేల ఆధునిక ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్‌బషీరాబాద్, జల్పల్లి పరిధిలోని లక్ష్మిగూడ ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే అర్హులైన ఆటో డ్రైవర్ కుటుంబాలకు సొంత నివాసం అందుబాటులోకి రానుంది.
నిత్యం ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ జీవనోపాధి పొందే ఆటో కార్మికులకు స్థిరమైన నివాసం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం భావిస్తోంది. అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబ అవసరాలను నిర్వహించుకోవాల్సి వస్తున్న కార్మికులకు సొంత ఇల్లు లభిస్తే ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. రెండు వేల కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపిక వంటి తదుపరి వివరాలు ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. తొలి దశలోనే నాలుగు ప్రాంతాలను ఎంపిక చేయడం ద్వారా హైదరాబాద్ పరిధిలోని ఆటో కార్మికులకు గృహ వసతి కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికను ముందుకు తీసుకెళ్తోంది.





























