ప్రతిపక్షం, నవంబర్ 14: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని రాహుల్‌గాంధీకి స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్ తదితరులు కూడా ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో సందడి నెలకొంది. ఏఐసీసీ కార్యదర్శులు సచిన్ సావంత్, సంపత్, వంశీచంద్, గురుదీప్ సఫల్, హర్కర వేణుగోపాల్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు స్వాగతం తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై రాహుల్‌గాంధీ దృష్టి సారించనున్నారు.
శనివారం పర్యటనలో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లతో రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక భద్రత, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానానికి సంబంధించి ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు రాహుల్‌గాంధీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ నాయకులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న భారత్ సమ్మిట్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ పర్యటన, భారత్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగం రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





























