ప్రతిపక్షం, నవంబర్ 14: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ బైక్ ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ర్యాలీ వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ర్యాలీ కారణంగా హెచ్ఐసీసీ, నోవాటెల్ వైపు వెళ్లే రహదారులతో పాటు సైబర్ టవర్స్ నుంచి హైటెక్స్ కమాన్ మీదుగా వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. సైబర్ టవర్స్ వైపు నుంచి కొండాపూర్, కొత్తగూడ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను యశోద వసంత సిటీ రోడ్, నోవాటెల్, ఆర్టీఏ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు. బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనదారులు ఐకియా రోటరీ, మీనాక్షి, రోలింగ్ హిల్స్, రాడిసన్ జంక్షన్ మార్గాలను వినియోగించాలని సూచించారు.
మరోవైపు కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్లే వాహనాలను రాడిసన్ జంక్షన్, ఏఐజీ ఆస్పత్రి, ఐకియా రోటరీ మీదుగా పంపించనున్నారు. టెక్ మహీంద్రా వైపు నుంచి హైటెక్ కమాన్ దిశగా వచ్చే వాహనాలను సీఐఐ జంక్షన్ వద్దే బొటానికల్ గార్డెన్ వైపు మళ్లించనున్నారు. ర్యాలీ మార్గాల్లో భారీ వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మళ్లింపులు చేపడుతున్నందున వాహనదారులు పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.
అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలపై ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ర్యాలీ జరిగే సమయంలోనూ పలు సాఫ్ట్వేర్ కంపెనీలు యథావిధిగా పనిచేయనున్నాయి. కార్యాలయాలు తెరిచి ఉండే సమయంలో ఉదయం మూడు గంటల పాటు ప్రధాన రహదారులపై ఆంక్షలు విధించడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే హైటెక్ సిటీ పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, రహదారుల మూసివేతతో పాటు వాహనాలను ఇతర మార్గాలకు మళ్లిస్తే కార్యాలయాలకు చేరుకోవడానికి మరింత సమయం పట్టవచ్చని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొండాపూర్, కొత్తగూడ, సైబర్ టవర్స్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.





























