ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం.. 348కు చేరిన గాలి నాణ్యత సూచీ

ప్రతిపక్షం, నవంబర్ 14: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. నగరవ్యాప్తంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 348 పాయింట్లుగా నమోదైంది. దీంతో గాలి నాణ్యత ‘వెరీ పూర్‌’ కేటగిరీలోకి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీలోని మొత్తం 48 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 300 పాయింట్లను దాటినట్లు అధికారులు వెల్లడించారు. నరేలా ప్రాంతంలోని ఎన్‌ఐహెచ్‌ కేంద్రం వద్ద అత్యధికంగా 429 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. కాలుష్యం తీవ్రత పెరగడంతో ప్రజలు కళ్ల మంటలు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై వాయు కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ)లోని మొదటి, రెండో, మూడో దశ ఆంక్షలను అమలు చేస్తున్నారు. కాలుష్యాన్ని పెంచే బొగ్గు, కట్టెల వినియోగంపై నిషేధం విధించడంతో పాటు డీజిల్‌ జనరేటర్ల వినియోగాన్ని కూడా నియంత్రిస్తున్నారు. ప్రజా రవాణాలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో సీఎన్‌జీ, విద్యుత్‌ బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. అత్యవసరం కాని నిర్మాణ పనులపైనా నిషేధం కొనసాగుతోంది.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదో తరగతి వరకు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యాలయాల్లోనూ సిబ్బంది హాజరును 50 శాతానికి పరిమితం చేసేలా ఆంక్షలు అమలు చేస్తున్నారు. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ గాలి నాణ్యత సూచీ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. పరిస్థితి మెరుగుపడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

Latest News