బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 14: ఎల్నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, జిల్లాను వెంటనే కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించి, మిగతా మండలాలను విస్మరించడం అన్యాయమన్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కరువు ప్రాంతాలను గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించలేదని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంతమైన మనోహరాబాద్ మండలాన్ని కరువు మండలంగా గుర్తించినప్పుడు జిల్లాలోని ఇతర మండలాల్లో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను కూడా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.మంజీరా పరివాహక ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని, చివరి దశకు చేరుకున్న పంటలు సైతం నీరు లేక నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను కూడా పరిహారం పరిధిలోకి తీసుకురావాలని, పూర్తిగా ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.కరువు పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం సూచిస్తున్నందున, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న సాగుకు సబ్సిడీపై విత్తనాలు అందించాలని సూచించారు. కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర లభించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించడంతో పాటు, కేంద్రాల వద్ద హమాలీలు, లారీల కొరత లేకుండా జిల్లా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు.ప్రభుత్వం వెంటనే మెదక్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో జిల్లాలోని రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కంటారెడ్డి తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



























