పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

*గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా తీర్చిదిద్దుతా – కలెక్టర్

*షార్ట్ కట్ చదువులకు స్వస్తి పలికి పుస్తకాలు చదవండి – యువతకు పిలుపు.

*నల్గొండలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం.

*నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 14 : పుస్తకం మనకు అమ్మలాంటిదని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. షార్ట్‌కట్ చదువులకు స్వస్తి పలికి, పుస్తకాలను పూర్తిగా చదివి విషయ పరిజ్ఞానాన్ని, అవగాహనను పెంపొందించుకోవాలని చెప్పారు.శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సరస్వతీ దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానంతో పాటు ఆలోచనా శక్తి, విశ్లేషణ సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జిల్లాలోని 23 గ్రంథాలయాలను (గ్రేడ్-1, 2, 3) డిజిటల్ గ్రంథాలయాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని, నేషనల్ డిజిటల్ లైబ్రరీ మిషన్ ద్వారా పాఠకులకు మరిన్ని వనరులు అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువత ప్రతిరోజూ గ్రంథాలయాలకు వచ్చి సంప్రదాయ పుస్తకాలతో పాటు డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ మామిడి కార్తీక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గాధ వినోద్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనా రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి బాలమ్మ, అధికారి ఎస్. వేణుగోపాలచార్యులు, ఆర్ కుసుమాశ్రీ, రాజేష్, సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Related News

Latest News