అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ పట్టాలు

ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం

గత పాలకులు పేదలను పట్టించుకోలేదు: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, సెప్టెంబర్ 29: మెదక్ పట్టణంలో అర్హులైన పేదలను గుర్తించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 243 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ పట్టా సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లలో పేదలకు సరైన స్థాయిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందలేదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున మంజూరు చేశారని గుర్తుచేసిన రోహిత్ రావు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, అప్పటి పాలనపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో కూడా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, గత పదేళ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిందని రోహిత్ రావు అన్నారు. దళిత బంధు పథకం అమలులో కూడా అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.డబుల్ బెడ్‌రూమ్ పట్టా సర్టిఫికెట్ల కోసం ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు అడిగితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, రెవెన్యూఅధికారులు.మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News