తగ్గిన చికెన్ ధరలు

ప్రతిపక్షం, నవంబర్ 15: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కార్తీకమాసం ప్రభావంతో మాంసాహారం కొనుగోళ్లు తగ్గడంతో కోళ్ల మాంసానికి డిమాండ్ పడిపోయినట్లు తెలుస్తోంది. గత వారంతో పోలిస్తే కిలో చికెన్‌పై సుమారు రూ.50 నుంచి రూ.80 వరకు ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో చాలామంది భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండటం, చికెన్ కొనుగోళ్లు తగ్గడం ధరలపై ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. దీంతో గత కొన్ని రోజులుగా పెరిగిన చికెన్ ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.260 నుంచి రూ.270 మధ్య పలుకుతోంది. వరంగల్‌లో రూ.250 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. నిజామాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి కిలో ధర రూ.200 నుంచి రూ.260 వరకు ఉండగా, కామారెడ్డిలో సుమారు రూ.260గా ఉంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత వారంతో పోలిస్తే ధరలు తగ్గడంతో చికెన్ కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం లభిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220 నుంచి రూ.230 మధ్య ఉండగా, ప్రకాశం జిల్లాలో రూ.260కు విక్రయిస్తున్నారు. నంద్యాల జిల్లాలో రూ.240 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో కిలో చికెన్ ధర సుమారు రూ.220గా నమోదైంది. ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు తగ్గినట్లు మార్కెట్ పరిస్థితులు సూచిస్తున్నాయి. కార్తీకమాసం కొనసాగుతున్న నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ ఎలా ఉంటుందన్న దానిపై రాబోయే రోజుల్లో ధరల మార్పులు ఆధారపడి ఉండనున్నాయి.

Related News

Latest News