•కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
•వాల్మీకి జిల్లా అధ్యక్షుడు ఉమ్మల్ల రాములు
వనపర్తి ప్రతినిధి, నవంబర్ 15(ప్రతిపక్షం): వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఉమ్మల్ల రాములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి బోయ సామాజిక వర్గం దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. తమ సామాజిక వర్గానికి తగిన రాజ్యాంగపరమైన గుర్తింపు, హక్కులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెల్లప్ప కమిషన్ సిఫార్సులు చేయడంతో పాటు రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ కేంద్ర స్థాయిలో ఈ అంశం ఇంకా తుది నిర్ణయానికి రాకపోవడం బాధాకరమన్నారు.
కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాల్మీకి సామాజిక వర్గానికి ఎస్టీ గుర్తింపు ఉన్నప్పుడు తెలంగాణలో నివసిస్తున్న వాల్మీకి బోయలకు ఆ హక్కు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.ఒకే సామాజిక నేపథ్యం కలిగిన ప్రజలకు ప్రాంతాలను బట్టి భిన్నమైన గుర్తింపు ఉండటం తమలో ఆవేదన కలిగిస్తోందన్నారు.వాల్మీకి బోయల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పెండింగ్లో ఉంచకుండా అవసరమైన రాజ్యాంగపరమైన ప్రక్రియను వేగవంతం చేసి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వాల్మీకి బోయ సామాజిక వర్గానికి న్యాయం జరిగే వరకు తమ హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉమ్మల్ల రాములు స్పష్టం చేశారు.




























