బాలల కథలకు పట్టం.. 470 కథల్లో ప్రతిభకు గుర్తింపు!

సిద్ధిపేట జిల్లా కథల పోటీల్లో విజేతలుగా నిలిచిన 28 మంది బాల కథకులు

డిసెంబర్‌లో బహుమతి ప్రదానోత్సవం

ప్రతిపక్షం,నంగునూరు, నవంబరు 15: చిన్నారుల్లో సాహిత్య సృజనకు ప్రోత్సాహం లభించింది. వారి కలం నుంచి జాలువారిన కథలకు గుర్తింపు దక్కింది. బాలలలో దాగివున్న ప్రతిభను వెలికితీసి సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో సుగుణ సాహితీ సమితి నిర్వహించిన జిల్లా స్థాయి ఉగాది బాలల కథల పోటీలు–2026లో ప్రతిభావంతులైన బాల కథకులు విజేతలుగా నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 470 కథలు పోటీకి రావడం బాలల్లో పెరుగుతున్న సాహిత్యాభిరుచికి నిదర్శనంగా నిలిచింది. సిద్ధిపేటకు చెందిన సుగుణ సాహితీ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ఫలితాలను సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య విడుదల చేశారు. విద్యార్థుల్లో పఠనాసక్తి, రచనా నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో కథలు పంపించారు. మొత్తం 470 కథలు పోటీలకు అందాయి. ప్రముఖ బాల సాహితీవేత్త ముక్కామల జానకీ రాం న్యాయనిర్ణేతగా వ్యవహరించి ఉత్తమ కథలను ఎంపిక చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు మర్పడగ చెన్నకృష్ణారెడ్డి సౌజన్యంతో డిసెంబర్‌ నెలలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు భైతి దుర్గయ్య తెలిపారు. ఆ సమావేశంలో విజేతలైన బాల కథకులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విజేతల వివరాలు..

ప్రథమ బహుమతి(రూ.1500 నగదు)

కోహెడ మండలం శనిగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. ప్రణతి రాసిన ‘అమ్మ ప్రేమ’ కథ రూ.1,500 నగదు బహుమతికి ఎంపికైంది.

ద్వితీయ బహుమతులు

రూ.1,000 చొప్పున రెండు బహుమతులు ప్రకటించారు. సిద్దిపేటకు చెందిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి డి.అనన్య పాటిల్ రాసిన ‘ఎవరు గొప్ప’ కథ, గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన మండల ప్రాథమికోన్నత పాఠశాల, ఎం. మహేశ్ రచించిన ‘పతంగి ఎగిరింది’ కథకు ద్వితీయ బహుమతులు దక్కాయి.

తృతీయ బహుమతులు

రూ.500 చొప్పున మూడు బహుమతులు ప్రకటించారు. బెజ్జంకి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.డి.అఫ్సాన రాసిన ‘రైతు కష్టం’ కథ, సిద్ధిపేట గ్రామీణ మండలం లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జె.స్నేహిత రచించిన ‘గారాబం’ కథ, చేర్యాల మండలం అర్జునపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.భవిష్య కలం నుంచి జాలువారిన కథ ‘ఎప్పుడు’ తృతీయ బహుమతికి ఎంపికయ్యాయి.

ప్రోత్సాహక బహుమతులు

రూ.300 చొప్పున ప్రోత్సాహక బహుమతులకు 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. సిద్ధిపేట గ్రామీణ మండలం బూరుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.సాహితి (‘మార్పు’) బెజ్జంకి తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థిని జి.హర్షిణి (‘దృఢ సంకల్పం’) చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.వైష్ణవి(‘దీపం’), బెజ్జంకి మండలం రేగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన డి.రవళి (‘ఓటు – నోటు’), చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామంచ విద్యార్థి ఎ.రేవతి(‘సహాయం’), సిద్ధిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల విద్యార్థి ఎ. మైత్రి(‘నాన్న నీడ’), చిన్నకోడూరు మండలం రామునిపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్. లాస్య (‘దొంగ బాబా’), తొగుట మండలం ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి.ఎం. నందిని(‘మార్పు’), గజ్వేల్ లోని తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థి సి.హెచ్. మహేశ్వరి (‘సంకల్పం’), కొండపాక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని జి. పునీత్ (‘నాన్న మనసు’), చిన్నకోడూరు మండలం అనంతసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి అఖిల(‘నీటి విలువ’) దౌల్తాబాద్ లోని తెలంగాణ గురుకుల పాఠశాలకు చెందిన టి.విఘ్నేశ్వరి(‘గురువు గొప్పదనం’), దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.రోహిత్(‘రాజు గొప్పదనం’), తొగుట మండలం ఘనపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్. శ్రీచరణ్
(‘స్నేహ బంధం’), చేర్యాల మండలం నర్సాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.కార్తీక్(‘సమయం విలువ’), చిన్నకోడూరు మండలం చౌడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇ.అరుణ్(‘పెద్దల మాట’), నారాయణరావు పేట మండలం జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన డి.అభిజ్ఞ (‘అమ్మ చెప్పిన మాట’), కుకునూరు పల్లి మండలం లకుడారం ఇలా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బి. లోకేష్(‘ఎవరు గొప్ప’), తొగుట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.అలకనంద(‘కష్టపడితే ఫలితం’), కొండపాక మండలం మర్పడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.అద్వైత(‘ఆశయ సాధన’), సిద్ధిపేట మున్సిపాలిటీ లింగారెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.హారిక(‘స్క్రీన్ లోకంలో’), కొండపాక మండలం ఖమ్మంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.వెన్నెల(‘కష్టాలు’) ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు.

బాల సాహిత్యానికి ప్రోత్సాహం అవసరం

ఈ కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు అనిశెట్టి సతీశ్, కోణం పర్ష రాములు, న్యాయవాదులు వరుకోలు రాజలింగం, ధోనే అశోక్, కవి వేల్పుల రాజు పాల్గొన్నారు.బాలల్లో సృజనాత్మకతకు పదును పెట్టే ఇలాంటి పోటీలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు. పుస్తక పఠనం, కథా రచన చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మంచి రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Related News

Latest News