చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలు చేయకుంటే సీఎం సభను అడ్డుకుంటాం!

ఈ నెల 19లోగా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయకుండా సిద్దిపేట పర్యటనను సహించేది లేదు

– ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ మాదిగ హెచ్చరిక

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 15: దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ నెల 19న సిద్ధిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటనను సహించేది లేదని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ మాదిగ హెచ్చరించారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రి పాల్గొనే సభను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం నంగునూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కె.దాసి మోహన్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వాన్ని దళితుల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నామని తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌, ముఖ్యమంత్రి ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు పథకానికి బదులుగా ప్రకటించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దళితులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి సిద్ధిపేట పర్యటనకు ముందే హామీల అమలుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం సభను అడ్డుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవులపల్లి నాగరాజు, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగాల నరసింహులు, మండల అధికార ప్రతినిధి దేవులపల్లి కృష్ణ, మండల సీనియర్ నాయకులు దేవులపల్లి భూమయ్య, దేవులపల్లి కనకయ్య, డి. అజిత్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News