తెలంగాణలో నేడు ‘పిల్లల ప్రజావాణి’

ప్రతిపక్షం, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులు, విద్యార్థులు తమ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్లకు తెలియజేసే అవకాశం కల్పిస్తున్నారు. పిల్లల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ డెస్క్‌లు, సహాయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

పాఠశాలల్లో ప్రవేశాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాల జారీలో జాప్యం వంటి సమస్యలపై పిల్లలు ఫిర్యాదులు చేయవచ్చు. అదేవిధంగా వైద్య సేవలు అందకపోవడం, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. పిల్లలు తమకు ఎదురవుతున్న సమస్యలను స్వయంగా వివరించేందుకు ఈ ప్రజావాణి వేదిక ఉపయోగపడనుంది.

సాధారణంగా చిన్నారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రజావాణిని ఏర్పాటు చేయడం ద్వారా వారి అభిప్రాయాలు, ఫిర్యాదులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. కలెక్టరేట్లకు వెళ్లలేని పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సహాయంతో ఫిర్యాదులను అధికారులకు అందజేయవచ్చు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా చూడనున్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను నిర్భయంగా అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

Related News

Latest News