పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ప్రతిపక్షం, నవంబర్ 16: చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా రహదారిపై దృశ్యమానత తగ్గి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ముఖ్యంగా తెల్లవారుజామున, ఉదయం వేళల్లో ప్రయాణించేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.

దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు వాహన వేగాన్ని తప్పనిసరిగా తగ్గించుకోవాలి. సాధారణ రహదారులపై ప్రయాణించే వేగంతోనే వెళ్లడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల కాంతి కళ్లకు ఇబ్బంది కలిగించకుండా హెడ్‌లైట్లను హైబీమ్‌లో కాకుండా లోబీమ్‌లో ఉంచాలి. అవసరమైన చోట ఫాగ్ ల్యాంప్స్‌ను వినియోగించాలి. అలాగే వాహనం ఇండికేటర్లను సక్రమంగా ఉపయోగిస్తూ, వెనుక నుంచి వచ్చే వాహనాలకు మన ప్రయాణ దిశ స్పష్టంగా తెలియజేయాలి. ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించడం కూడా చాలా ముఖ్యం. పొగమంచులో ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేసినా, దాన్ని ఢీకొట్టకుండా ఉండేందుకు ఈ దూరం ఉపయోగపడుతుంది.

పొగమంచు సమయంలో ఓవర్‌టేకింగ్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనం ఎంత దూరంలో ఉందో స్పష్టంగా కనిపించకపోవడంతో ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. వాహనాల అద్దాలపై తేమ పేరుకుపోయి బయట దృశ్యాలు సరిగా కనిపించకపోవచ్చు. అలాంటి సమయంలో డీఫాగర్‌ను ఉపయోగించి అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలి. విండ్‌షీల్డ్‌పై పొగమంచు లేదా తేమ పేరుకుపోకుండా చూసుకోవాలి. వాహనంలోని హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, బ్రేక్‌లైట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రయాణానికి ముందే తనిఖీ చేసుకోవాలి.

ముఖ్యంగా పొగమంచు మరీ దట్టంగా ఉండి రహదారి సరిగా కనిపించని పరిస్థితుల్లో ప్రయాణాన్ని కొనసాగించకుండా సురక్షితమైన ప్రదేశంలో వాహనాన్ని నిలిపివేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. రహదారిపై అకస్మాత్తుగా వాహనాన్ని ఆపకుండా, సాధ్యమైనంతవరకు సురక్షితమైన ప్రదేశానికి చేరుకుని ఆపాలి. అత్యవసరం కాని ప్రయాణాలను పొగమంచు తగ్గిన తర్వాత ప్రారంభించడం ఉత్తమం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌తో పాటు అవసరమైన రక్షణ పరికరాలు ధరించాలి. కార్లలో ప్రయాణించేవారు సీటుబెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. వాహనదారులు తొందరపాటు, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే పొగమంచు సమయంలో ప్రమాదాల ముప్పును తగ్గించుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలను ఇతర వాహనదారులకు కూడా తెలియజేసి ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

Related News

Latest News