ప్రతిపక్షం, నవంబర్ 16: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆదివాసీల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ముఖ్యంగా గిరిజన మహిళల సాధికారత కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల హక్కులను పరిరక్షించడంతోపాటు వారికి విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన జనజాతీయ గౌరవ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బిర్సా ముండా చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ గిరిజన సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిని నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. బ్రిటిష్ పాలకులు బిర్సా ముండాను నిర్బంధించిన రాంచీలోని పాత సెంట్రల్ జైలును ఆయన త్యాగాలకు గుర్తుగా స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన యోధుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి చరిత్రను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను గుర్తించి, వారి సేవలకు తగిన గౌరవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్‌గా నిర్వహించడం కూడా గిరిజన వీరుల చరిత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడంలో భాగమని తెలిపారు.
గత 75 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి నక్సలైట్ల కార్యకలాపాలు కూడా కారణమయ్యాయని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సలిజం కారణంగా అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్ల ప్రభావాన్ని తగ్గించి, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలను మెరుగుపరచడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. బిర్సా ముండా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. జల్, జమీన్, జంగిల్‌పై గిరిజనులకు ఉన్న హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. గిరిజనుల భూములు, అటవీ సంపద, జీవన విధానాలపై వారి హక్కులను కాపాడేందుకు బిర్సా ముండా చేసిన పోరాటం నేటి తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని రాంచందర్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో గిరిజనుల సంక్షేమం, భూముల సమస్యల పరిష్కారం, అభివృద్ధి విషయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు భూములపై హక్కులు కల్పించేలా పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన కుటుంబాలకు భద్రత కల్పించాలంటే భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమం ద్వారా బిర్సా ముండా ఆశయాలను, గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గిరిజన సమాజానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రకు తగిన గుర్తింపు రావాలని, వారి త్యాగాలను దేశ ప్రజలు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎస్టీ మోర్చా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
























