సేవా స్ఫూర్తికి జాతీయ గుర్తింపు!

హక్కుల పోరాటానికి అవార్డు కిరీటం!

జైన శ్రీనివాస్‌కు జాతీయస్థాయి పురస్కారం..

ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ప్రైడ్‌ ఆఫ్‌ భారతరత్న’ పురస్కారం

రవీంద్రభారతిలో సత్కారం..

అవార్డును అందించిన ప్రగతి ఫౌండేషన్‌ చైర్మన్‌

నాగరాజుపల్లిలో హర్షాతిరేకం

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 16: ప్రజల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా.. సమాచార చైతన్యం ఆయుధంగా.. సమాజ సేవ ధ్యేయంగా సాగుతున్న జైన శ్రీనివాస్‌ కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఆయన సామాజిక సేవా రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను శ్రీ ప్రగతి ఫౌండేషన్ వారి ‘ప్రైడ్‌ ఆఫ్‌ భారతరత్న పురస్కారం – 2026’ కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శ్రీ ప్రగతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పురస్కార ప్రదానోత్సవంలో ఫౌండేషన్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, చైర్మన్‌ డాక్టర్‌ వి.ఆర్‌. శ్రీనివాసరాజు చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. జైన శ్రీనివాస్ సమాచార పరిరక్షణ కమిటీ ద్వారా ప్రజలకు సమాచార హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత కోసం జైన శ్రీనివాస్‌ చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. దీపావళి పండుగ, జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న పలువురికి అవార్డులను ప్రదానం చేశారు. అందులో భాగంగానే జైన శ్రీనివాస్‌ను నిర్వాహకులు సత్కరించారు.

సమాచార హక్కు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న జైన శ్రీనివాస్‌ సామాన్య ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పించడమే కాకుండా, సమాచారాన్ని పొందడం ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించేలా చైతన్య పరుస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కులపై అవగాహన ఉండాలని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు ప్రజల భాగస్వామ్యం అవసరమనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పురస్కారాలు వ్యక్తిగత ప్రతిభకు గుర్తింపుగా నిలవడమే కాక మరింత బాధ్యతతో ముందుకు సాగేందుకు ప్రేరణనిస్తాయని పలువురు పేర్కొంటున్నారు. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వేదిక వరకు తన సేవా ప్రయాణాన్ని విస్తరించిన జైన శ్రీనివాస్‌కు ఈ పురస్కారం దక్కడం నాగరాజుపల్లి గ్రామానికి, నంగునూరు మండలానికి గర్వకారణంగా మారింది.ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు జైన శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ గుర్తింపు మరింత మందిలో సామాజిక సేవా స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు.

Related News

Latest News