ప్రతిపక్షం, నవంబర్ 16: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి వచ్చిన ప్రజలతో మంత్రి మాట్లాడి వారి సమస్యలు, వినతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులు, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఒక్కరి దరఖాస్తును తప్పనిసరిగా రికార్డు చేయాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం భీమదేవరపల్లి మండలంలో వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫామ్ పాండ్స్ ఏర్పాటు, ఆరుతడి పంటల సాగు, విద్యుత్ సమస్యలతో పాటు విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. గతంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇంకా ఏయే సమస్యలు పెండింగ్లో ఉన్నాయనే వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆర్అండ్బీ అధికారులతో కూడా చర్చించారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు అందాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే పూర్తి వివరాలను మంత్రి అధికారుల నుంచి సేకరించారు. ప్రతి వారం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల సంఖ్య, పరిష్కారమైన సమస్యలు, పెండింగ్లో ఉన్న వినతుల వివరాలతో వారంవారీ నివేదిక రూపొందించి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజావాణి నిర్వహించే సమయంలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం, సంబంధిత ఆధారాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కేవలం దరఖాస్తులు స్వీకరించడంతోనే సరిపెట్టకుండా, వాటి పరిష్కారానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అధికారుల ప్రధాన ప్రాధాన్యత కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.





























