2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలి
ఎన్నికల హామీని నిలబెట్టుకోండి
లేకుంటే ఉద్యమం ఉధృతం
తపస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ నర్సిరెడ్డి హెచ్చరిక
ప్రతిపక్షం,నంగునూరు, నవంబరు 16: పాత పెన్షన్ విధానం అమలులో ఉన్నప్పుడు జారీ ఆయన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రభుత్వ జాప్యం వల్ల ఉద్యోగాల్లో ఆలస్యంగా చేరారు. దీంతో పెన్షన్‌లో మాత్రం మరో విధానం! నియామకాల్లో జరిగిన జాప్యానికి ఉపాధ్యాయులెందుకు శిక్ష అనుభవించాలి? డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఎందుకు వర్తింప జేయరు? సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ఎన్నికల హామీ ఏమైంది? ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ వెంటనే అమలు చేయాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తపస్ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ నర్సిరెడ్డి హెచ్చరించారు. నంగునూరులో సోమవారం నిర్వహించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మండల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాత పెన్షన్ విధానం అమలులో ఉన్న సమయంలోనే డీఎస్సీ-2003 నోటిఫికేషన్ విడుదలైందని గుర్తుచేశారు. అయితే వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ఆలస్యమైందన్నారు. దీంతో ఆ డీఎస్సీ ద్వారా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. నియామక ప్రక్రియలో జరిగిన జాప్యానికి ఉపాధ్యాయులు బాధ్యులు కాదన్నారు. కానీ ఆ జాప్యం కారణంగా జీవితాంతం పెన్షన్ భద్రత కోల్పోయే పరిస్థితి రావడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీ ఇచ్చి.. మరిచారా?
ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నర్సిరెడ్డి గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్నా ఆ హామీ అమలుకు స్పష్టమైన చర్యలు లేకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితానికి పెన్షన్ ఎంతో కీలకమన్నారు. జీవితకాలం ప్రభుత్వ విద్యారంగానికి సేవలందించిన ఉపాధ్యాయులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సమస్యను ప్రత్యేకంగా పరిగణించి న్యాయం చేయాలని కోరారు.
స్పందించకుంటే పోరాటమే!
డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు అందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపజేసేలా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేసి ఉపాధ్యాయుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే తపస్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.దశలవారీగా ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల పెన్షన్ హక్కుల సాధన కోసం సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో తపస్ నంగునూరు మండల శాఖ అధ్యక్షుడు కత్తుల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్ర కాంత్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్‌కు మద్దతు తెలిపారు.



























