సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రి ని చేస్తా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వెయ్యి రోజుల ప్రజాపాలనలో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు

రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పాలసీ

రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి సిరిసిల్ల సెప్టెంబర్ 30: రానున్న ఎన్నికలలో సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీ హై కమాండ్ ను ఒప్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా జూనియర్ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ జి. మహేష్ బాబాసాహెబ్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.

సిరిసిల్లలో చేనేత, పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న నేత బజారు నిర్మాణ పనులకు, సిరిసిల్ల, వేములవాడలో రూ.200 కోట్ల చొప్పున నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులకు, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనులకు, రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు.

పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని, వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్‌ను, వేములవాడ, సిరిసిల్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ధైర్యం, దైవం కలిసి వెలిసిన ప్రాంతం సిరిసిల్ల అని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో దైవచింతనతో పాటు, తమ పూర్వీకులు నిజాం రజాకార్లపై చేసిన వీరోచిత పోరాటానికి సిరిసిల్ల ప్రజలు వారసులని పేర్కొన్నారు.

సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అయితే పదేళ్ల టీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని అన్నారు. మనిషి నాగరికతకు మొదటి అడుగు వస్త్రమని, వస్త్ర పరిశ్రమకు అసలైన చిరునామా సిరిసిల్ల అని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలు వస్త్ర పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయని, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చీరలు, అగ్గిపెట్టెలో పెట్టగలిగేంత సన్నని చీరలను తయారు చేసే నైపుణ్యం ఇక్కడి చేనేత కార్మికుల సొంతమని అన్నారు.

2009 నుంచి 2023 వరకు అరడజను సార్లు జరిగిన ఎన్నికల్లో కేటీఆర్ గెలిచినప్పటికీ చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేదని, కార్మికుల గల్ఫ్ వలసలు ఎందుకు ఆగలేదని ప్రజలు ఆలోచించాలని అన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కనీసం వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురాలేని పరిస్థితి గత పాలనలో ఉండేదని అన్నారు.

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని స్థానిక నాయకులు కోరగా, విదేశాల్లో ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడంతో పాటు సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు.

2004, 2006, 2008 సంవత్సరాల్లో మూడుసార్లు కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినప్పటికీ 2009లో కేసీఆర్ పాలమూరుకు వలస వెళ్లారని అన్నారు. గత పాలకులపై అవినీతి ఆరోపణలు చేస్తూ, కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

గోదావరి జలాలను అడ్డం పెట్టుకుని మానేరు ఇసుకను దోచుకున్నారని ఆరోపిస్తూ, నేరెళ్ల బాధితులు ఇందుకు సజీవ సాక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఇక్కడికి తీసుకువస్తే పోలీసులు నిర్బంధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

మిడ్‌మానేరు డ్యాం ముంపులో ఇళ్లు కోల్పోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇళ్ల స్థలాలు పొందలేదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల ప్రజల ఓట్లు కేటీఆర్‌కు పచ్చనోట్లుగా మారాయని ఆరోపించారు. వేములవాడ శివయ్య, భద్రాచలం రామయ్యను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని వ్యాఖ్యానించారు.

వెయ్యి రోజుల ప్రజాపాలనలో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేశామని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశామని, వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని అన్నారు.ఎమ్మార్వో కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

సిరిసిల్లలో మార్పు రాబోతోందని, ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు.రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలు కొట్టుకుపోయి కేసీఆర్ ఇంట్లో నోట్ల కట్టలుగా తేలాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 9, 10, 11, 12 పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇక్కడి రైతులకు గోదావరి జలాలు చేరలేదని అన్నారు.

కుటుంబ పాలన కావాలో, ప్రజాపాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. గత పాలకులు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించారా అని ప్రశ్నించారు. పదేళ్ల సమయం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించేందుకు సరిపోలేదా అని అన్నారు.గత పాలకులు పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, బతుకమ్మ చీరల్లో కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు.బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ.350 కోట్ల బకాయిలను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.

రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలను గత పాలకులు అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం కోటి ఆరు లక్షల కుటుంబాలకు చెందిన 3 కోట్ల 46 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు చెల్లించిందని అన్నారు. ఈ పండుగకు ప్రభుత్వం చిలక చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు.

రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.20,614 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు.

నేటి పాలనలో శ్రీకాంతాచారి తల్లిని మహిళా కమిషన్ సభ్యురాలిగా, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, వేములవాడ రాజన్న సాక్షిగా ప్రజాపాలన-2 తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా వస్తుందని అన్నారు. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడి ప్రతి ఎన్నికకు ఆస్తులు పెరుగుతున్నాయని, ఏ వ్యాపారం చేస్తే ఆస్తులు పెరిగాయో చెప్పాలని ప్రశ్నించారు.

నేరెళ్ల ఘటన సమయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారిని తీసుకువస్తే ఘటన స్థలానికి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలతో ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కోట్ల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణన నిర్వహించి రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారని డాక్యుమెంట్ ప్రచురించామని తెలిపారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం ప్రపంచ ఖ్యాతి గాంచిందని అన్నారు. రైతన్న ప్రజలకు అన్నం పెడితే, నేతన్న ప్రజల గౌరవాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు.గత పాలకులు సిరిసిల్ల నేతన్నలకు పెట్టిన రూ.500 కోట్ల బకాయిలను ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చెల్లించిందన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రూ.50 కోట్ల మేరకు రుణాలను మాఫీ చేశామని తెలిపారు.
వేములవాడలో రూ.50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుత పాలనలో 365 రోజులు చేతినిండా పని ఉండేలా ప్రభుత్వమే ఆర్డర్లు కల్పించిందన్నారు. మహిళలు పెళ్లిళ్లకు కూడా కట్టుకొని వెళ్లే విధంగా నాణ్యమైన చీరలను అందిస్తున్నామని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, డిసెంబర్ 2023లో ప్రజాపాలన రాష్ట్రంలో వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం, ప్రజలకు మౌలిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమం, నేతన్నల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.

బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా చేస్తున్నాయని అన్నారు. గత పాలకులు పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని పేర్కొన్నారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, నేతన్నలకు, ముంపు గ్రామాల ప్రజలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయని పాలన సాగించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన అన్ని గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.

నేరెళ్ల ఘటన సమయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారిని తీసుకువచ్చి న్యాయం చేయాలని పోరాటం చేశామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేరెళ్ల బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ వరదకాలువ, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులను నిర్మించిందని అన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, నేరెళ్ల బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కరకట్ట వద్ద దళితులకు సంబంధించి 300 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని పేదలకు అసైన్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు రూ.200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి మొదటి అడుగు పడిందని, రెండవ అడుగు సిద్దిపేటలో, మూడవ అడుగు గజ్వేల్‌లో పడుతుందని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

మల్కపేట రిజర్వాయర్ కాలువ భూసేకరణ పనులకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని అన్నారు.
వేములవాడ దేవాలయానికి గత పాలకులు సంవత్సరానికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారని, నేటి ప్రభుత్వం రూ.250 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

గత ప్రభుత్వం నేతన్నలకు పెట్టిన రూ.375 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు, గత సంవత్సరం 6.90 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చి చేతినిండా పని కల్పించామని అన్నారు.ముంపు గ్రామాల బాధితులకు పెండింగ్‌లో ఉన్న రూ.35 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారని తెలిపారు. 4,600 కుటుంబాలకు పైగా రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని, మరో 6,000 కుటుంబాల వరకు వేచి చూస్తున్నారని, వారికి కూడా ముఖ్యమంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 9, 10, 11, 12 కాలువల నిర్మాణానికి భూసేకరణ నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు జిల్లా కలెక్టర్ జ్ఞాపికను అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమూరి నరేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మదన్‌మోహన్ రావు, లక్ష్మీకాంతరావు, డాక్టర్ సంజయ్, శ్రీగణేష్, నాగరాజు, కుంభం అనిల్ రెడ్డి, నవీన్ యాదవ్, సంపత్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, వివిధ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News