జాతీయ కౌన్సిల్‌కు ఒకరు.. రాష్ట్ర కౌన్సిల్‌కు నలుగురు ఏకగ్రీవ ఎన్నిక
జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తాం – నూతన కౌన్సిల్ సభ్యులు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 15: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ, రాష్ట్ర కౌన్సిల్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యత లభించింది. జిల్లాకు చెందిన ఒకరు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, నలుగురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇటీవల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.మెదక్ జిల్లా నుంచి సీనియర్ జర్నలిస్ట్ పబ్బతి సురేందర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, ఎన్. గోపాల్ గౌడ్ (దిశ), దౌలయ్య (నమస్తే తెలంగాణ), మహమ్మద్ రహ్మద్ అలీ (రాజ్ న్యూస్), భువన్ కుమార్ (సాక్షి టీవీ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బుచ్చన్న ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు.తమపై నమ్మకం ఉంచి కౌన్సిల్ ఎన్నికకు సహకరించిన యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, మెదక్ జిల్లాలోని జర్నలిస్టులందరికీ నూతన కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

































