అసమానతలు అంతమయ్యే వరకు అక్షర యుద్ధం!

దళిత గాయాలకు అక్షర రూపం ‘లంద’

మూడు తరాల కన్నీటి గాథ.. పోరాటాల ప్రతిరూపం ‘లంద’

దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఆగదు

తెలంగాణ బతుకు సుగంధం

దళిత అస్తిత్వానికి అక్షర సాక్ష్యం ‘లంద’

దళిత జీవితాల లోతులు, తెలంగాణ మూడు తరాల గాయాలకు అద్దం పట్టిన నవల

సమాజంలో దోపిడీ, అణచివేత ఉన్నంతకాలం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది

  • డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (కత్తుల లక్ష్మారెడ్డి, సిద్ధన్నపేట):

ప్రతిపక్షం, నవంబర్ 16: సమాజంలో అసమానతలు, దోపిడీ, అణచివేత పూర్తిగా నిర్మూలన అయ్యే వరకు సామాజిక పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి స్పష్టం చేశారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను, అణగారిన వర్గాల జీవితాల్లోని అంతర్మథనాన్ని, తరతరాలుగా పేరుకు పోయిన గాయాలను అక్షరాల్లో ఆవిష్కరించడమే నిజమైన రచయిత లక్షణమని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత డాక్టర్ పొన్నాల బాలయ్య రచించిన ‘లంద’ నవల దళిత జీవితాల లోతుల్లోంచి పుట్టిన బలమైన సాహిత్య సృజన అని కొనియాడారు.సిద్ధిలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘లంద’ నవల పరిచయ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ రచయిత అయితే జీవితాన్ని దగ్గరగా స్పర్శించి, ప్రజల అనుభవాలను అర్థం చేసుకొని వాటి లోతుల్లోకి వెళ్లి రచన చేస్తారో వారి రచనలు సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ‘లంద’ నవల తెలంగాణలోని మూడు తరాల దళిత జీవితాల గాయాలను, అనుభవాలను, సంఘర్షణలను ఆవిష్కరించిందని వివరించారు. ఈ నవలలో కేవలం బాధలు, కన్నీళ్లు మాత్రమే కాకుండా జీవన పోరాటం, పెనుగులాట, తండ్లాట, విజయబాటతో కూడిన జీవన సుగంధం ఉందని అభివర్ణించారు.

‘లంద’ నుంచి వ్యవసాయ సంస్కృతి పుట్టుకొచ్చిందని చెప్పారు. తెలంగాణ సమాజానికి ప్రత్యేకమైన అద్భుతమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని పేర్కొన్నారు. అయితే ఆ సంస్కృతిలోని మూలాలను అర్థం చేసుకోకుండా వివిధ రూపాల్లో కొత్త అలంకరణలు, మేకప్‌లు జోడిస్తూ హల్దీ, దాండియా, కోలాటాల వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పునకు విద్య ఎంతో కీలకమని పేర్కొన్నారు. చదువుల విస్తరణ వల్లనే అంటరానితనం తగ్గుముఖం పట్టిందన్నారు.ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం రచయితలు, కవులు, గాయకుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. కవులు, గాయకులు, జర్నలిస్టులు సమాజాన్ని ప్రభావితం చేసే రచయితలేనని పేర్కొన్నారు. సమాజంలో దోపిడీ కొనసాగుతున్నంత కాలం పోరాటం ఆగదని చెప్పారు. అయితే ప్రతి పోరాటానికి వ్యూహం, చాకచక్యం అవసరమని అన్నారు. అవకాశవాద పోరాటాలు కాలక్రమంలో కనుమరుగవుతాయని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం జరిగే నిజమైన ఉద్యమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ఉద్యమాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ‘జై భీమ్’ అనే నినాదాన్ని పలకడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితలకు సమాజం కంటే ముందుగా ఆలోచించే ముందుచూపు ఉంటుందని తెలిపారు. ఎక్కడ అణచివేత, హింస కనిపించినా అక్కడ ప్రశ్నించే గొంతుకలుగా నిలిచి పోరాడాలని సూచించారు.

చరిత్రలో నిలిచే నవల ‘లంద’

విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ‘లంద’ నవల చరిత్రలో నిలిచిపోయే రచనగా అభివర్ణించారు. సమకాలీన సామాజిక పరిస్థితులను, ఉద్యమాల నేపథ్యాన్ని నవల అద్భుతంగా స్పర్శించిందని పేర్కొన్నారు. యుద్ధం ఇంకా మిగిలే ఉందనే భావనతో రచయిత నవలను ముగించడం ఎంతో గొప్ప సాహిత్య అభివ్యక్తి అని అన్నారు. సమాజంలో పరిష్కారం కాని సమస్యలు, కొనసాగుతున్న వివక్ష, అణచివేతలకు ఈ ముగింపు అద్దం పడుతుందని వివరించారు.

పదేళ్ల కృషికి ప్రతిరూపం ‘లంద’

నవల రచయిత డాక్టర్ పొన్నాల బాలయ్య మాట్లాడుతూ సుమారు పదేళ్ల నిరంతర కృషి, అనుభవాలు, ఆలోచనల ఫలితంగానే ‘లంద’ నవల రూపుదిద్దుకుందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన రచయితలు, కవులు, గాయకులు మౌనం వహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌ను చూసి తీవ్రంగా చలించిపోయానని తెలిపారు. ఆ సంఘటన తనను ఆలోచింపజేసి ఈ నవల రచనకు ప్రేరణ ఇచ్చిందని వెల్లడించారు.సమాజంలో వివక్షకు, దగాకు గురవుతున్న దళిత యువకులే తన నవలలో హీరోలని పేర్కొన్నారు.ఒక జాతి అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేయడంతో పాటు, ఆ జాతి జీవన అనుభవాలు, భావజాలాన్ని విస్తృత సమాజానికి పరిచయం చేయాలనే సంకల్పంతోనే ఈ నవలను రచించినట్లు వివరించారు. అణగారిన వర్గాల జీవితాలను సాహిత్యంలో ప్రతిబింబించడం ద్వారా సామాజిక చైతన్యానికి దోహదపడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

మనువాదం, సామ్రాజ్యవాదం దేశానికి ముప్పు

  • నలిగంటి శరత్

సభలో మరో ముఖ్య వక్తగా పాల్గొన్న బహుజన నేత, ఉస్మానియా విశ్వవిద్యాలయం బీఫ్ ఫెస్టివల్ సారథి నలిగంటి శరత్ చమాల్ మాట్లాడుతూ భారత దేశానికి మనువాదం, సామ్రాజ్యవాదం నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ‘లంద’ నవలలో ఒడువని దుఃఖం, బానిస బతుకులు, వర్గపోరాటాలు, ఎదురు దెబ్బలు, తరతరాల గాయాలు స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వల్ల అణగారిన వర్గాలకు, అంటరాని తరాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి కులాలు, వలస జీవుల ప్రయోజనాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆవు నెయ్యి తినేవారు, ఆవు పాలు తాగేవారు ఆవుకు గాయమైతే చికిత్స చేసేది ఎవరు? అది చనిపోతే దాని మృతదేహాన్ని శుభ్రం చేసేది ఎవరు? అనే ప్రశ్నల ద్వారా సమాజంలోని ఉత్పత్తి కులాల శ్రమకు లభిస్తున్న గుర్తింపుపై ఆలోచించాలని సూచించారు. సామ్రాజ్య వాద, దోపిడీ పునాదులను అంబేద్కర్ వారసులు తమ చైతన్యంతో కదిలిస్తారని హెచ్చరించారు.

తెలంగాణ గాయాలు, సంస్కృతికి అద్దం

సభకు అధ్యక్షత వహించిన మరసం అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి మాట్లాడుతూ ‘లంద’ నవల తెలంగాణ సమాజంలోని గాయాలను, సంస్కృతిని సమర్థవంతంగా ఎత్తి చూపిందన్నారు. ప్రముఖ కవి డాక్టర్ తైదల అంజయ్య మాట్లాడుతూ దళితుల శోకం, సామాజిక అనుభవాల నుంచి ఈ నవల పుట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు తోట అశోక్ మాట్లాడుతూ ‘లంద’ నవల జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకునే సాహిత్య ప్రమాణాలు కలిగి ఉందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి సారథి భగవాన్ రెడ్డి, తెరసం ప్రధాన కార్యదర్శి గంభీరావుపేట యాదగిరి, ఆరేపల్లి సర్పంచ్ చిట్యాల బాబు రాజు, ఉపసర్పంచ్ గోండ నర్సింగరావు, పోరెడ్డిపల్లి సర్పంచ్ తప్పేడ రజిత యాదయ్య, ప్రముఖ గాయకులు నర్సింలు, పెద్దమాతరి బాబు మాదిగ, కవి చెన్న రాజు, డప్పుల బాబు, పోచబోయిన శ్రీహరి యాదవ్, అడ్వకేట్ యాదగిరి, బూరం అభినవ్ తదితరులు పాల్గొన్నారు.


అక్షరమే ఆయుధంగా… అణచివేతపై అక్షర పోరాటంగా…
‘లంద’ నవల పరిచయ సభ కేవలం ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన చర్చగా కాకుండా, దళిత జీవితాలు, తెలంగాణ సంస్కృతి, సామాజిక అసమానతలు, అస్తిత్వ పోరాటాలపై జరిగిన విస్తృతమైన చర్చగా నిలిచింది. సాహిత్యం సమాజానికి అద్దం పట్టడమే కాకుండా, అన్యాయాలను ప్రశ్నించి మార్పు దిశగా నడిపించాలనే సందేశాన్ని ఈ సభ చాటిచెప్పింది.

Related News

Latest News