కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు క్షమాపణ చెప్పాలి
- ఎమ్మార్పీఎస్ సీనియర్స్ రాష్ట్ర అధ్యక్షుడు దేవుని సతీష్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దమాతరి బాబు*
సిద్ధిపేటలో వెయ్యి డప్పులతో మాదిగ, మాల జేఏసీ నిరసన గర్జన
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట, నవంబర్ 16: దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను ఎంతమాత్రం సహించబోమని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు హెచ్చరించారు. దళితులను అవమానించిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేటలో మాదిగ, మాల జాయింట్ యాక్షన్ కమిటీ, ఎమ్మార్పీఎస్ సీనియర్ ఆధ్వర్యంలో వెయ్యి డప్పులతో నిరసన గర్జన నిర్వహించారు. పట్టణంలోని ఇందిరమ్మ సర్కిల్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు డప్పులు మోగిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్యలను ఖండించాలని నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ రాష్ట్ర అధ్యక్షుడు దేవుని సతీష్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దమాతరి బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
స్పీకర్‌పై దూషణలు.. దళితుల ఆగ్రహం
సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాల సమయంలో నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించిన ఘటనను వారు ప్రస్తావించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత నాయకుడిని అవమానించడం దురదృష్టకరమని అన్నారు.ఈ ఘటనకు నిరసనగా సెప్టెంబర్ 8న తెలంగాణ దళితులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద సావు డప్పు మోగిస్తూ నిరసన తెలిపారని గుర్తుచేశారు.
పసుపు నీళ్ల శుద్ధి… అంటరానితనానికి నిదర్శనం
దళితులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లినందున ఆ ప్రదేశం మైలపడిందనే భావనతో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో వ్యవసాయ క్షేత్రం పరిసరాలను శుద్ధి చేశారని నాయకులు ఆరోపించారు. ఈ చర్య దళితుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బ తీసిందని మండిపడ్డారు.అంటరానితనం మహా పాపమని చెప్పే నాయకులు, ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటివరకు బహిరంగ క్షమాపణ చెప్పలేదని విమర్శించారు. పసుపు నీళ్లతో శుద్ధి చేసిన నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 30లోపు క్షమాపణ చెప్పాలి
ఈ నెల 30వ తేదీ లోపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నంది నగర్‌లోని కేసీఆర్, కేటీఆర్ నివాసాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను ఏ రాజకీయ పార్టీ చేసినా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
వెయ్యి డప్పులతో ఆత్మగౌరవ గర్జన
కేసీఆర్‌కు జన్మనిచ్చిన గడ్డ సిద్ధిపేటలోనే దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని బలంగా వినిపించాలనే ఉద్దేశంతో వెయ్యి డప్పులతో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. మాదిగ, మాల ఐక్యతతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు డప్పులతో పాల్గొని సంఘీభావం తెలిపారు. దళితులపై వివక్ష, అంటరానితనం, అవమానకరమైన చర్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మగౌరవ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ నిరసన ప్రదర్శనలో రాష్ట్ర కార్యదర్శి బాబురావు రొమాల, మంకాల రాంచంద్రం, బాకూరు అశోక్, జింజర పెల్లేసు, బొమ్మల విజయ్, కాటపాక రాజు, శ్యాంసుందర్, అశోక్, ఏటి బాను, మోజెస్, థామస్, రామచంద్రం, బాల్ నర్సు, చంద్రమౌళి తదితర ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.





























