ఎన్నికల హామీలను విస్మరించడం తగదు.
సీఎం రేవంత్ రెడ్డికి దివ్యాంగుల విజ్ఞప్తి
అంబేద్కర్ సర్కిల్ వద్ద ఫ్లకార్డులతో నిరసన
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 16: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దివ్యాంగులను నిర్లక్ష్యం చేయడం తగదని, తమకు ఇచ్చిన ఐదు ప్రధాన హామీలను వెంటనే నెరవేర్చాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా దివ్యాంగులకు పలు హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి ఇంత కాలమైనా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం బాధాకరమని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు.
దివ్యాంగుల ఐదు ప్రధాన డిమాండ్లు ఇవే.
దివ్యాంగుల నెలవారీ పింఛన్‌ను ప్రస్తుత మొత్తానికి బదులుగా రూ.6,000కు పెంచాలని కోరారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఆర్పీడబ్ల్యూడీ–2016 చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
సీఎం పర్యటన సందర్భంగా ప్రత్యేక విజ్ఞప్తి
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా దివ్యాంగుల తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధిపేట వేదికగా దివ్యాంగులకు ఇచ్చిన ఐదు ఎన్నికల హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించి, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
జాలి కాదు.. హక్కులు కావాలి
దివ్యాంగులు కోరేది జాలి, దయాదాక్షిణ్యాలు కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, గౌరవప్రదమైన జీవితం మాత్రమేనని నిరసనకారులు స్పష్టం చేశారు. ఆర్థిక భద్రత, స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టాలని సిద్ధిపేట జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం (డీ ఎస్ ఎస్) తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దండు శంకర్, కట్కూరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు





























