ప్రతిపక్షం, నవంబర్ 17: ‘అక్వాన్’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నెల 21న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజా ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఈ నెల 20, 21 తేదీల్లో వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతం, దాని ప్రయాణ దిశను బట్టి వర్షాల తీవ్రతలో మార్పులు ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ఐఎండీ, జిల్లా అధికారుల తాజా హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.





























