ప్రతిపక్షం, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 15 ఏళ్ల క్రితం తాను చేపట్టిన ఆరు రోజుల పాదయాత్రను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు సాగిన ఈ పాదయాత్రకు సంబంధించిన పాత జ్ఞాపకాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉద్యమ సమయంలో ప్రజల్లో తెలంగాణ ఆకాంక్షను మరింత బలంగా వినిపించేందుకు చేపట్టిన ఈ యాత్ర తనకు ప్రత్యేకమైన అనుభవమని గుర్తుచేసుకున్నారు. ఆనాటి పాదయాత్రకు సంబంధించిన ఫొటోలను కూడా ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ అధినేత, అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ ఈ పాదయాత్ర చేపట్టారు. వికారాబాద్ నుంచి ప్రారంభమైన యాత్ర ఆరు రోజుల పాటు వివిధ ప్రాంతాల మీదుగా సాగి కుత్బుల్లాపూర్ వరకు చేరుకుంది. ఈ క్రమంలో నవాబ్‌పేట్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్ సర్కిల్ ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించినట్లు కేటీఆర్ తన పోస్టులో గుర్తుచేసుకున్నారు.
ఆనాటి పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కేటీఆర్ పేర్కొన్నారు. సబ్బండ వర్గాల మద్దతుతో యాత్ర స్ఫూర్తిదాయకంగా సాగిందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు సాగించిన పోరాటంలో ప్రతి ప్రాంతం, ప్రతి వర్గం భాగస్వామ్యమైందని ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ప్రజలతో ఏర్పడిన అనుబంధం, ఉద్యమానికి లభించిన మద్దతు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని ఆయన పోస్టు ద్వారా తెలియజేశారు.
పాదయాత్ర ప్రారంభమై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ చేసిన ఈ పోస్టు తెలంగాణ ఉద్యమ కాలం నాటి సంఘటనలను మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది. అప్పటి ఫొటోలను పంచుకోవడంతో పాటు చివరగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. ఉద్యమంలో తాను పాల్గొన్న కీలక ఘట్టాలను గుర్తుచేసుకుంటూ చేసిన ఈ పోస్టు బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను స్మరించుకునే వారిలో ఆసక్తిని కలిగించింది.



























