సమ్మక్కసాగర్‌కు ఎన్వోసీ సాధించడమే లక్ష్యం.. నేడు ఛత్తీస్‌గఢ్‌కు సీఎం రేవంత్ బృందం

ప్రతిపక్షం, నవంబర్ 17: తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలకమైన సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం నేడు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో రేవంత్ రెడ్డి సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం బృందం అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుపై ఆ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేసి, అనుమతులు పొందడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం.

గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్వోసీ పొందడం అత్యంత కీలకంగా మారింది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు ఏర్పడే బ్యాక్‌వాటర్ కారణంగా ఛత్తీస్‌గఢ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏయే ప్రాంతాలు, గ్రామాలు ప్రభావితమవుతాయి? ఎంత భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది? బాధితులకు ఎంత పరిహారం చెల్లించాలి? అనే అంశాలపై స్పష్టత తీసుకురావాల్సి ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపించి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ముంపు సమస్యపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం ఆధారంగా బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ ద్వారా అధ్యయనం చేయించింది. ముంపు పరిధిలోకి వచ్చే భూములు, గ్రామాల వివరాలను గుర్తించేందుకు సర్వే నిర్వహించే దిశగా రూ.9 కోట్లకు పైగా నిధులు కూడా చెల్లించినట్లు సమాచారం. ఒకవేళ ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని భూములు ముంపునకు గురైతే నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. సాంకేతిక అంశాలతో పాటు పరిహారానికి సంబంధించిన వివరాలను కూడా తాజా సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఈ అంశంపై గతంలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కలిసి ప్రాజెక్టు వివరాలను వివరించారు. ముంపు ప్రభావం, భూముల గుర్తింపు, పరిహారం చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తూ ఎన్వోసీ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లి చర్చలు జరపనుండటంతో ఈ వ్యవహారంలో పురోగతి సాధిస్తారా అనే ఆసక్తి నెలకొంది.

ఇటీవల ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలోనూ రేవంత్ రెడ్డి సమ్మక్కసాగర్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి త్వరగా నిరభ్యంతర పత్రం లభించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో జరగనున్న భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ, ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనాపరమైన అంశాలను వివరించి అనుమతులు పొందేందుకు సీఎం బృందం ప్రయత్నించనుంది.

సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వినియోగించుకుని తెలంగాణలో సాగునీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అంచనా. అదేవిధంగా రామప్ప-పాకాల లింక్ కెనాల్ ద్వారా మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళిక కూడా ఉంది. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే సమ్మక్కసాగర్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం రావాల్సి ఉంది. అందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీ సాధించడం కీలకంగా మారింది. నేటి సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరి నిరభ్యంతర పత్రం దిశగా అడుగులు పడతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News