ప్రతిపక్షం, నవంబర్ 17: టికెట్ లేకుండా వందేభారత్ రైలులోకి ఎక్కిన 13 మందికి రైల్వే అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న తమ కుటుంబసభ్యులను కొద్దిసేపు కలిసేందుకు 13 మంది ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి వందేభారత్ రైలు ఎక్కారు. అయితే రైలులోని ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో వారు వెంటనే కిందకు దిగలేకపోయారు. దీంతో రైలు అధికారులు వారిని గుర్తించి తనిఖీ చేయగా, ఎవరి వద్దా ప్రయాణ టికెట్లు లేవని తేలింది.
టికెట్లు లేకుండా రైలులోకి ప్రవేశించినందుకు రైల్వే అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. టికెట్ ఛార్జీలతో పాటు జరిమానాను కలిపి మొత్తం రూ.36,140 వసూలు చేశారు. కుటుంబసభ్యులను కలిసేందుకే రైలు ఎక్కామని వారు చెప్పినప్పటికీ అధికారులు నిబంధనల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి అనుమతి ఉండటం, రైలులోకి ఎక్కడానికి అనుమతి ఉండటం రెండూ వేర్వేరు విషయాలని మరోసారి స్పష్టమైంది.
రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలంటే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఆ టికెట్ ఆధారంగా రైలులో ప్రయాణించడం లేదా టికెట్ లేకుండా రైలు ఎక్కడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. రైలులో ప్రయాణించాలంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ప్రయాణ టికెట్ ఉండాలని సూచించారు. కుటుంబసభ్యులను సాగనంపేందుకు లేదా కలిసేందుకు స్టేషన్‌కు వచ్చే వారు కూడా రైల్వే నిబంధనలను పాటించాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది.



























