పేద విద్యార్థినికి రూ.6 వేల ఆర్థిక ప్రోత్సాహం

  • మన్నెంపల్లి పాఠశాల పూర్వ విద్యార్థినికి బహుజన ఏకలవ్య ఫౌండేషన్ చేయూత

ప్రతిపక్షం, మానకొండూర్, నవంబర్ 18: చదువులో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుజన ఏకలవ్య ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని గండ్రాజ్ శ్రీవల్లికి రూ.6 వేల నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు.పోరండ్ల గ్రామానికి చెందిన గండ్రాజ్ శ్రీవల్లి 2026 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 545 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంతోపాటు తిమ్మాపూర్ మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆమె చదువుకు ఆర్థిక చేయూత అందించాలని ఫౌండేషన్ నిర్ణయించింది.

బహుజన ఏకలవ్య ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు మల్లవరపు సుబ్బులు భర్త మల్లవరపు దాసు వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.6 వేల చెక్కును మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చకినాల రాంమోహన్ విద్యార్థినికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మానుపాటి రాజయ్య, ఉపసర్పంచ్ బూడిద కిషోర్, మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్, తాళ్లపెల్లి కిరణ్, బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News