- కొమురవెల్లి మల్లన్న టెంపుల్ కు వంద కోట్ల నిధులు ప్రకటించాలి.
- కొమురవెల్లి మల్లన్న జాతరను స్టేట్ ఫెస్టివల్ జాతరగా ప్రకటించాలి.
ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్,18: నేడు సిద్దిపేట పర్యటనకు వచ్చే సీఎం రేవంత్ రెడ్డి మొదట రైతులకు సమాధానం చెప్పాలని రసులాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ పచిమడ్ల స్వామి గౌడ్ అన్నారు. బుధవారం కొమురవెల్లి మండలంలోని రసులాబాద్లో పీఏసీఎస్ వడ్ల మార్కెట్లో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా మాజీ సర్పంచ్ స్వామి గౌడ్ మాట్లాడుతూ మార్కెట్లో ఇప్పటి వరకు ఒక బస్తా ధాన్యాన్ని కూడా కొనలేదని, రైతు బంధు కూడా సకాలంలో రావట్లేదని రైతులు ఆవేదనతో చెప్పారని అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసి వారం రోజులు అవుతున్న ఇప్పటి వరకు ధాన్యం కొనకపోవడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని హామీలను ఇచ్చి ప్రజలను రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వడ్లను కొనుగోలు చేశారని, రైతుబంధు,24 గంటల కరెంటు, రైతు బీమా సకాలంలో ఇచ్చారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, రైతుబంధు ఇవ్వకపోవడం రైతులకు కరెంటు కోతలు రైతు బీమా మాట అసలు లేదని అన్నారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లాకు గతంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేక ఇప్పుడు వచ్చి మళ్లీ హామీలు ఇవ్వడం అంటే సిద్దిపేట ప్రజలను రైతులను మోసం చేసినట్లేనని అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతికి రూ.20 లక్షలు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అన్నారు. జిల్లా కేంద్రానికి రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అన్నారు. కొమురవెల్లిలో పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి దేవస్థానానికి కూడా వేములవాడలో ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారో అలాగే కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు వంద కోట్ల నిధులు ప్రకటించాలని అన్నారు. కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలను తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ జాతరగా గుర్తించి ప్రతి ఏటా ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రోళ్ల సుదర్శన్, వార్డు సభ్యులు అన్నెబోయిన మల్లేశం, md బోధూర్, గ్రామ రైతులు ప్రజలు రాములు, శ్రీనివాస్, నరసయ్య, బాలమ్మ, బాలయ్య, కనకయ్య పాల్గొన్నారు.





























