*3630 మందికి చేయూత పింఛన్ పత్రాల పంపిణీ –
*పింఛన్ రూ.2000 కాదు, రూ.5000 ఇచ్చినా తప్పులేదు – ప్రతి మండలంలో ఓల్డేజ్ హోం పెట్టాలి.
*మూడేళ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు.
*తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు – తండ్రి పాత్ర పోషించాల్సిన సీఎం వివక్ష చూపొద్దు.
*మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రతి పక్షం మునుగోడు నవంబర్ 18 : మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జరిగిన నూతన చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గంలోని నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, చండూరు మండలాలతో పాటు చండూరు మున్సిపాలిటీలో చేయూత పింఛన్ కి ఎంపికైన 3630 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.మునుగోడు మండలంలోని 28 గ్రామాలకు చెందిన 845 మంది, చండూరు మండలంలోని 19 గ్రామాలకు చెందిన 530 మంది, చండూరు మున్సిపాలిటీలోని 10 వార్డులకు చెందిన 293 మంది, మర్రిగూడ మండలంలోని 18 గ్రామాలకు చెందిన 785 మంది, నాంపల్లి మండలంలోని 32 గ్రామాలకు చెందిన 651 మంది లబ్ధిదారులు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలను అందుకున్నారు. పెన్షన్ అందుకున్న వారిలో ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా పింఛన్ అందుకుంటున్న వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు అభినందనలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న తరుణం ఇదని అన్నారు. అప్లై చేసుకున్న వారిలో నూటికి 90 శాతం మందికి వచ్చాయని, పింఛన్ల మంజూరు విషయంలో తాము జోక్యం చేసుకోలేదని, రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.ప్రభుత్వ సొమ్ము పేదవాళ్లకు చెందాలి, అనర్హులకు వెళ్లొద్దని, గతంలో అసెంబ్లీలో చెప్పానని, రైతుబంధు అనేది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ సొమ్ము పేద ప్రజలకు, పేద రైతులకు చెందాలి, ఉన్న వాళ్లకు వద్దనేది నా ఉద్దేశమని తేల్చి చెప్పారు.ప్రభుత్వానికి సూచన చేస్తున్నానని, గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులు మనం చేయొద్దనేది నా అభిప్రాయమని అన్నారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నా నైజమని, ఇలా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని ప్రచారం చేస్తున్నారని, ప్రజల కోసం, ప్రజల మంచి కోసం మాత్రమే మాట్లాడతానని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం అనేవి ప్రభుత్వానికి రెండు కండ్లని, గత ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద అప్పుచేసి కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అవినీతి చేసిపోయిందని, ఇప్పుడు అప్పు కట్టలేక ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం పుట్టిన పార్టీ అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా గాంధీ ఆశయాలు, రాజీవ్ గాంధీ ఆశయాలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు.గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటికి తీసి ప్రజాధనాన్ని రికవరీ చేసి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని మనము అవలంబిస్తే అభివృద్ధి, సంక్షేమం చేయలేమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పామని, మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, ఒకసారి మాట ఇస్తే మాట తప్పము, మడమ తిప్పం అనేది వైఎస్ఆర్ ఆనాడు అన్నారని గుర్తుచేశారు. ఎందుకు చేయలేకపోతున్నామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అన్నారు.మునుగోడులో జరిగే రోడ్ అభివృద్ధి పనులు ఆరు నెలలు చేసి నిధులు రాక కాంట్రాక్టర్లు వెళ్ళిపోతున్నారని, ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడే విధంగా ప్రభుత్వం పనిచేయాలని మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
పదవుల్లో ఉండేవాళ్లు బాధ్యతగా ప్రవర్తించాలని, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నిజాయితీగా పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పింఛన్ 2000 కాదు, 5000 ఇచ్చినా తప్పులేదని, ప్రతి మండల కేంద్రంలో ఓల్డేజ్ హోం పెట్టాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో ఉండి అవినీతి చేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నారని, అదే దోపిడీ కొనసాగుతోందని, ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర పెట్టుబడిదారులదే నడుస్తోందని ఆరోపించారు.పేదల కోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటారని, తాను రాజకీయాలకి వచ్చింది పేదల కోసమని, భగవంతుడు దయవల్ల తన కుటుంబం బాగానే ఉందని, తాను పదవుల కోసం పాకులాడట్లేదని స్పష్టం చేశారు.మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని, తమ నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని కోరారు. మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న దమ్మున్న లీడర్ని గెలిపించారని, కానీ అడుక్కుతినే లీడర్ని గెలిపించలేదని అన్నారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని అడుగుతున్నానని, తెలంగాణ రాష్ట్రం అంటే కొడంగల్, మధిర నియోజకవర్గాలే కాదని, కొడంగల్ కి 10000 కాకపోతే 20వేల కోట్లు తీసుకెళ్ళు మాకు అభ్యంతరం లేదని, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అడుగుతున్నప్పుడు అభివృద్ధికి నిధులు ఇవ్వాలి కానీ పండబెట్టి తొక్కుతా అని అనడం భావ్యం కాదని అన్నారు. తండ్రి పాత్ర పోషించాల్సిన ముఖ్యమంత్రి వివక్ష చూపొద్దని హితవు పలికారు.తాను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మనిషినేనని, కానీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి నిధులు కావాలని అయ్యప్ప దీక్షలో కోరుతున్నానని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనేదే తమ కోరికని అన్నారు.మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం అవుతుందని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రజల సొమ్మును కాపాడే మనిషిని, తినే మనిషిని కాదని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
































