ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 28 : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పార్టీలకు అతీతంగా మంగళవారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిల్ సభ్యులు, పలువురు నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జయంతి, వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. గతేడాది నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందజేసి పేదవారి గుండెల్లో చోటు సంపాదించుకున్న మహానీయుడని కొనియాడారు. తనకు వెంటనే ప్రభుత్వం భరతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంస్కారాలను చేపట్టిన మహా నాయకుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు.