నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ప్రతిపక్షం, నవంబర్ 19: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని (International Men’s Day) జరుపుకుంటారు. కుటుంబం కోసం నిరంతరం శ్రమించే పురుషుల సేవలను గుర్తించడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశం. సాధారణంగా పురుషులు అంటే కుటుంబ బాధ్యతలు మోసేవారు, ఆర్థికంగా అండగా నిలిచేవారు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండేవారు అనే అభిప్రాయం సమాజంలో ఉంటుంది. అయితే ఈ బాధ్యతల వెనుక వారు అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి పెద్దగా చర్చ జరగదు. అలాంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పురుషుల భావోద్వేగాలు, ఆరోగ్యం, సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అందిస్తోంది.

2026 మెన్స్ డే థీమ్ ఏమిటంటే?

ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి ‘ది ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీవన్’ (The Future Is Everyone) అనే థీమ్‌ను ఎంపిక చేశారు. అంటే భవిష్యత్తు అందరిదీ అనే అర్థం. సమాజ అభివృద్ధిలో పురుషులు, మహిళలు ఇద్దరికీ సమానమైన పాత్ర, గౌరవం, అవకాశాలు ఉండాలనే సందేశాన్ని ఈ థీమ్ తెలియజేస్తోంది. లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించడం, పరస్పర గౌరవం, సహకారం, సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడం దీని ముఖ్య ఉద్దేశం. పురుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారి కుటుంబ, సామాజిక సేవలను గుర్తించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు.

1999లో ప్రారంభమైన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని తొలిసారిగా 1999లో ప్రారంభించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని వెస్ట్ ఇండీస్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేసిన డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 19న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో పురుషుల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారత్‌లోనూ ఈ రోజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2007లో ఉమా చల్లా ఈ వేడుకలను దేశంలో విస్తృతంగా నిర్వహించేందుకు చొరవ తీసుకున్నారు. బెంగళూరులోని సేవ్ ది ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్‌తో పాటు పలు సంస్థల ద్వారా పురుషుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆమె కృషి చేశారు.

పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, సమాజం విధించే అంచనాల మధ్య ఎంతోమంది పురుషులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే తమ బాధలను ఇతరులతో పంచుకోవడానికి చాలామంది సంకోచిస్తారు. పురుషులు ఏడవకూడదు, బలహీనతలను బయటపెట్టకూడదు, ప్రతి సమస్యను ఒంటరిగా ఎదుర్కోవాలి అనే భావనలు వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పురుషులు తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్య నిపుణుల సహాయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ రోజు గుర్తుచేస్తుంది.

అలాగే పురుషుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన కల్పించడం కూడా ఈ దినోత్సవంలో కీలక అంశం. శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి అలవాట్లను ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, అవసరమైన సహాయం అందించడం వంటి అంశాలపై చర్చ జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మహిళా దినోత్సవానికి పోటీ కాదు.. సమానత్వానికి ప్రతీక!

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నప్పుడు పురుషుల కోసం ప్రత్యేకంగా మరో రోజు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ రెండు దినోత్సవాలు ఒకదానికొకటి పోటీ కావు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కుల గురించి చర్చించడం ఎంత అవసరమో.. పురుషులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, సామాజిక సమస్యలను గుర్తించడం కూడా అంతే అవసరం. ఒకరిని మరొకరితో పోల్చకుండా ఇద్దరికీ సమాన గౌరవం, అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించడమే ఈ దినోత్సవాల అసలు సందేశం.

మొత్తంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అంటే కేవలం పురుషులకు శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాదు. కుటుంబం, సమాజం కోసం వారు చేస్తున్న కృషిని గుర్తించడంతో పాటు వారి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుచేసే ప్రత్యేకమైన రోజు. బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో తమను తాము మర్చిపోకుండా ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఈ రోజు ప్రతి ఒక్కరికీ సందేశాన్ని ఇస్తోంది.

Related News

Latest News