తినడం, తాగడం, మజా చేయడం మన సంస్కృతి కాదు: మోదీ

ప్రతిపక్షం, నవంబర్ 19: దేశ ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల పొదుపు అలవాట్లు, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ఆయన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిలో పొదుపుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ, ప్రజలు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే అలవాటు పెంచుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

“పొదుపు అనేది భారతీయ సంస్కృతిలో భాగం. తినడం, తాగడం, సరదాగా గడపడమే మన సంస్కృతి కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని డబ్బును ఆదా చేసుకోవడం కూడా మన జీవన విధానంలో భాగం కావాలి” అని మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రజల్లో పొదుపు ప్రాధాన్యతను వివరించేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబాలు తమ ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడం, అనవసర వ్యయాలను తగ్గించుకోవడం, అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పినట్లు సమాచారం.

2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో అనేక రంగాల్లో పురోగతి సాధించామని ప్రధాని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుదల రావడానికి చర్యలు తీసుకున్నామని వివరించినట్లు సమాచారం. అయితే సాధించిన పురోగతిని కొనసాగించాలంటే ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరమని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఖర్చు చేయడం, పొదుపును నిర్లక్ష్యం చేయడం వంటి అలవాట్లు పెరిగితే వ్యక్తిగత కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడటమే కాకుండా, దీర్ఘకాలంలో సాధించిన అభివృద్ధి ఫలితాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తమ తమ శాఖల పరిధిలో ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక, బాధ్యతాయుతమైన ఖర్చులపై ప్రజలకు సరైన సమాచారం అందేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలన్నది ఈ చర్చలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు, మంత్రులకు ఇచ్చిన నిర్దిష్ట కార్యాచరణ సూచనలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Related News

Latest News