‘సైబరాబాద్ మూవ్స్–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

400కు పైగా విద్యాసంస్థల నుంచి 3.5 లక్షల మంది విద్యార్థులకు పిలుపు

సైబరాబాద్, ప్రతిపక్షం,నవంబర్ 19: నగర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచి, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ‘సైబరాబాద్ మూవ్స్–2026’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమ పోస్టర్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.

‘కమ్, మేక్ యువర్ మూవ్!’ (రండి.. మీ వంతు మార్పు తీసుకురండి) అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్సీ), డబ్ల్యూఆర్ఐ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణహిత ప్రయాణ విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పబ్లిక్ సౌకర్యాలను పెంపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైకిల్ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, డబ్ల్యూఆర్ఐ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా 74 కీలక కూడళ్లను జంక్షన్లుగా అభివృద్ధి చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ముఖ్యంగా 400కు పైగా విద్యాసంస్థలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులను భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సురక్షితమైన, సమర్థవంతమైన, వాతావరణ మార్పులకు అనుకూలమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజా రవాణాను మరింతగా వినియోగించుకోవాలని, నగర ప్రయాణ విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలిసారిగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నగర రవాణా వ్యవస్థలో సానుకూల మార్పులకు నాంది కావాలని ఆకాంక్షించారు.

Related News

Latest News