ప్రతిపక్షం, నవంబర్ 20: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన నివాసాలతో పాటు వ్యాపార సంస్థల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. రూ.40.96 కోట్ల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి సత్తెనపల్లిలోని రేఖా నాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల మేర కొరత ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బియ్యాన్ని అప్పగించకుండా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
2022-23, 2023-24, 2024-25 యాసంగి సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించగా, నిర్ణీత నిబంధనల ప్రకారం మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే సంబంధిత మిల్లులో భారీ మొత్తంలో ధాన్యం లెక్కల్లో తేడాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ అక్రమాలపై గతంలోనే రేఖా నాయక్‌పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని 316(2), 316(5), 318(4) సెక్షన్లతో పాటు నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిన కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ధాన్యం అక్రమాల ద్వారా వచ్చిన సొమ్ము ఎక్కడికి మళ్లించారు? ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో జరిగాయి? అక్రమంగా సంపాదించిన నిధులను ఇతర ఆస్తుల కొనుగోలుకు వినియోగించారా? అనే అంశాలపై ఈడీ బృందాలు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో లభించే పత్రాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.





























