ఇందిరమ్మ చీరల పంపిణీ వాయిదా

ప్రతిపక్షం, నవంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు సిద్దిపేట పర్యటనలో భాగంగా ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. చీరల పంపిణీకి సంబంధించి త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. దీంతో చీరల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

ఇదిలా ఉండగా, సిద్దిపేట పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.544 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరా చౌరస్తా నుంచి బహిరంగ సభ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాదయాత్రగా వెళ్లనున్నారు. అనంతరం నిర్వహించే సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి కొత్త తేదీ ప్రకటించిన తర్వాత పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Related News

Latest News