బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజే రూ.5,120 పతనం!

ప్రతిపక్షం, నవంబర్ 20: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పసిడి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఊరటనిచ్చేలా 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారం ధరల్లోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5,120 తగ్గి రూ.1,25,570కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.4,700 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,15,100 వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజులోనే ఇంత భారీగా ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1,75,000కు చేరుకుంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు కొనుగోలుదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

అయితే బంగారం, వెండి ధరలు నగరాలను బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్రకటించిన ధరలకు అదనంగా 3 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు, ఇతర పన్నులు కూడా వర్తిస్తాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను తెలుసుకోవడం మంచిది. ఒక్కరోజులో భారీగా తగ్గిన పసిడి ధరలు రానున్న రోజుల్లో ఏ విధంగా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News