జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ నైట్ షీల్డ్” కార్యక్రమం నిర్వహణ- జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్

“ఆపరేషన్ నైట్ షీల్డ్” కార్యక్రమం తో అక్రమార్కులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు!

అర్ధరాత్రి వేళ అనవసర సంచారానికి కట్టడికి – నేరాల నియంత్రణే లక్ష్యం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ప్రతిపక్షం, నవంబర్ 21: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం మరియు అర్ధరాత్రి వేళ ప్రజల అనవసర సంచారాన్ని నియంత్రించే లక్ష్యంతో గౌరవ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం అర్ధరాత్రి “ఆపరేషన్ నైట్ షీల్డ్” కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహించింది.జిల్లాలోని ప్రధాన కూడళ్లు, పట్టణాలు, గ్రామాలు, రహదారులు మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు.రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను, వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.వారి వివరాలు,ప్రయాణ ఉద్దేశం తదితర అంశాలను విచారించి అవసరమైన సమాచారాన్ని సేకరించారు.

అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో ఎలాంటి అవసరం లేకుండా రోడ్లపై సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి,వారిని విచారించి, రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగడం వల్ల కలిగే ప్రమాదాలు,నేరాలకు గురయ్యే అవకాశాలు మరియు శాంతిభద్రతలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు,సిబ్బంది సమన్వయంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.రాత్రి వేళల్లో దొంగతనాలు,చోరీలు,ఇతర అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగా అరికట్టడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ మాట్లాడుతూ,జిల్లా ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రథమ ప్రాధాన్యత అని,నేరాల నియంత్రణకు మరియు శాంతిభద్రతల పరిరక్షణకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలు, పెట్రోలింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరిస్తూ, రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయట సంచరించవద్దని సూచించారు.ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎస్పి అశోక్,జిల్లా పోలీసు అధికారులు మరియు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ప్రజల భద్రత – పోలీసుల బాధ్యత. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యం.

Related News

Latest News