ఇందిరమ్మ బీమా దరఖాస్తుల్లో కీలక మార్పులు.

ప్రతిపక్షం, నవంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ముద్రించిన దరఖాస్తుల ద్వారా వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించినప్పటికీ, తాజాగా ఆ విధానాన్ని మార్చారు. ఇకపై వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మార్పుల నేపథ్యంలో గురువారం నిర్వహించాల్సిన శిబిరాలను అధికారులు వాయిదా వేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం శుక్రవారం నుంచి గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ అప్లికేషన్‌తో పాటు మొబైల్ అప్లికేషన్‌ను రూపొందిస్తోంది. మొబైల్ యాప్ గురువారం సాయంత్రానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, వెబ్ అప్లికేషన్‌ను శుక్రవారం నుంచి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది లబ్ధిదారులకు సహకరిస్తూ ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయనున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

రేషన్ కార్డు నంబరును నమోదు చేయగానే అందులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు అప్లికేషన్‌లో కనిపించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. అనంతరం బీమా పొందాల్సిన కుటుంబ సభ్యుడి పేరు, నామినీ వివరాలను ఎంపిక చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ విధానంలో ప్రత్యేకంగా పత్రాలను స్కాన్ చేయడం, దరఖాస్తులను ప్రింట్ తీసి సంతకాలు చేయించడం వంటి అవసరాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుడి మొబైల్ ఫోన్‌కు సందేశం ద్వారా సమాచారం అందించనున్నారు. దీంతో నమోదు ప్రక్రియను వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకం అర్హత నిబంధనల్లోనూ కీలక మార్పు చేసినట్లు తెలుస్తోంది. తొలుత పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా వర్తింపజేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేలా వెబ్, మొబైల్ అప్లికేషన్లలో మార్పులు చేస్తున్నారు. రేషన్ కార్డు లేని వారు కొత్తగా కార్డు పొందిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించనున్నారు. రేషన్ కార్డు నంబరు లేకుండా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగకుండా సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, కుటుంబంలోని ఎవరైనా గతంలో ప్రభుత్వం అమలు చేసిన ఇతర బీమా పథకాల పరిధిలో ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు దరఖాస్తులో అదనపు ప్రశ్నను కూడా చేర్చనున్నారు. తద్వారా గతంలో బీమా ప్రయోజనం పొందిన వారి వివరాలను గుర్తించేందుకు అధికారులకు వీలవుతుంది. జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 48 వార్డులతో పాటు 282 గ్రామ పంచాయతీల్లో శిబిరాల ద్వారా నమోదు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులతో ఇందిరమ్మ బీమా దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ ఆధారితంగా మారనుంది. అయితే, దరఖాస్తుల ప్రారంభ సమయం, అర్హతలకు సంబంధించిన తుది మార్గదర్శకాలను అధికారికంగా వెల్లడించిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

Related News

Latest News