విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు క్విజ్ పోటీలు దోహదం

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 20: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు మండల స్థాయి క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), జడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్ తదితర పాఠశాలల్లో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోటీలు జరుగుతున్న తీరును, విద్యార్థులకు అడుగుతున్న జనరల్ నాలెడ్జ్, సైన్స్, గణితం, సాంఘిక శాస్త్ర అంశాలకు సంబంధించిన ప్రశ్నల ప్రమాణాలను ఆమె పరిశీలించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం పోటీ పరీక్షల్లో రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తగిన శిక్షణ అందించాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.విద్యార్థుల్లో పుస్తక పఠనం, దినపత్రికలు చదివే అలవాటును పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల స్థాయి క్విజ్ పోటీలు రాబోయే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేసే చక్కని వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో మరిన్ని విద్యా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల విజ్ఞాన వికాసానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Related News

Latest News