ప్రతిపక్షం, నవంబర్ 20: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా స్పందిస్తూ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు హర్షించరని, అదృష్టం కొద్దీ వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు క్షమించరని ఆయన వ్యాఖ్యానించారు.
రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్లో పాలకులు అధికార అహంకారానికి దూరంగా ఉండాలని సూచించారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా పాలన సాగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలకులు వ్యవహరించాలని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడే వారిని, దుర్మార్గపు పాలన సాగించే పాలకులను ప్రజలు ఎప్పటికీ క్షమించరని తన ట్వీట్లో స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు నిజాయతీగా పాలన సాగించేలా పాలకులకు జ్ఞానం ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సొంత పార్టీ నేతలపై చేసిన విమర్శలకు పరోక్షంగా కౌంటర్‌గా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ట్వీట్లో సీఎం పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు నేతలు తమ అసంతృప్తిని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయా అనే చర్చకు ఈ ట్వీట్ మరింత బలం చేకూర్చింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ పోస్టు కాంగ్రెస్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.





























