క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉంది

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రతిపక్షం ప్రతినిధి సిరిసిల్ల అక్టోబర్ 4 : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఆదివారం వేములవాడ పట్టణంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారి ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.గతంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి వివిధ బాధ్యతలు నిర్వహించిన సమయంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనిచ్చామని విప్ తెలిపారు. 2008లో శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్న సమయంలో క్రీడలకు సంబంధించి అవార్డు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా వాలీబాల్ పోటీలను కరీంనగర్‌లో విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర బాధ్యతల కారణంగా తేదీల ఖరారులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత కమిటీ సూచించిన తేదీలకు అనుగుణంగా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఆతిథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని విప్ వెల్లడించారు.

క్రీడాకారులకు వసతి, భోజనం అందించేందుకు కళ్యాణ మండపాలు, ఇతర అనువైన వేదికలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కమిటీ సూచించిన మెనూ ప్రకారం భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

తమ ప్రాంతానికి వచ్చిన క్రీడాకారులను అతిథులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గతంలో వాలీబాల్ పోటీలకు హాజరైన క్రీడాకారులు సైతం స్థానికుల ఆతిథ్యం, ఆత్మీయతను ప్రశంసిస్తూ వెళ్లారని గుర్తుచేశారు. ప్రస్తుతం కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, వాటి ద్వారా క్రీడాకారులకు మంచి అనుభూతిని అందించి చిరకాలం గుర్తుండిపోయేలా చూడాలని అన్నారు. సామాన్య కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదుగుతున్న క్రీడాకారుల కష్టాలను గుర్తించి వారికి అన్ని విధాలా సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీల ముగింపు వరకు ఇదే విధంగా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు, నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. క్రీడాకారుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం కల్పించిన రాష్ట్రస్థాయి కమిటీకి, సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నిర్వాహకులకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన అవకాశాలు కల్పించి, వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News