సిద్ధిపేట జిల్లా పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహిద్ధాం

జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటేవిధంగా మూడు రోజుల ఉత్సవాలు

తన్నీరు హరీశ్‌ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 4: సిద్ధిపేట జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా ఖ్యాతి, కీర్తి ఎల్లలు దాటేవిధంగా మూడు రోజుల పాటు పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, పదేళ్లలో సాధించిన అభివృద్ధి ప్రతిబింబించేలా అన్ని వర్గాల భాగస్వామ్యంతో వేడుకలను నిర్వహించాలని సూచించారు. సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, విశ్రాంత ఉద్యోగులు, ప్రైవేట్‌ పాఠశాలల సంఘాలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతో జిల్లా పదేళ్ల పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు వివిధ రంగాల ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించారు.

దశాబ్దాల ఆకాంక్షకు సాకారం

సిద్ధిపేట జిల్లా ఏర్పాటు అనేది దశాబ్దాల ప్రజల ఆకాంక్ష అని హరీశ్‌ రావు పేర్కొన్నారు. 1983 నుంచి సిద్ధిపేట జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్‌ కొనసాగిందని చెప్పారు. అప్పట్లో జిల్లా ఏర్పాటు కోసం కేసీఆర్‌ అర్జీ పెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేశారని తెలిపారు. 2016 అక్టోబర్‌ 11వ తేదీన నూతన జిల్లాకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు అనంతరం సిద్ధిపేటలో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. గోదావరి జలాలు, రైలు మార్గం, జిల్లా కేంద్రానికి అవసరమైన పరిపాలనా సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో సిద్ధిపేట అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం అయిందన్నారు.

నాటి సిద్ధిపేట–నేటి సిద్ధిపేట గురించి భావితరాలకు తెలియాలి

సిద్ధిపేట జిల్లా ఏర్పాటు కంటే ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, వ్యాపారులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని హరీశ్‌ రావు పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని చెప్పారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సిద్ధిపేటను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కృషి జరిగిందని అన్నారు. “నాటి సిద్ధిపేట ఎలా ఉంది? నేడు ఎలా మారింది?” అనే విషయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి, ప్రజల అనుభవాలు, జిల్లాకు సంబంధించిన చారిత్రక అంశాలను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.

చరిత్ర, సంస్కృతి, అభివృద్ధిపై పుస్తకం

సిద్దిపేట జిల్లా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ప్రస్థానం, అభివృద్ధి తదితర అంశాలతో ప్రత్యేక పుస్తకం, సావనీర్‌ రూపొందించాలని హరీశ్‌ రావు సూచించారు. నాటి సిద్దిపేట నుంచి నేటి సిద్దిపేట వరకు జరిగిన మార్పులను ప్రతిబింబించేలా ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించాలని తెలిపారు. సిద్ధిపేట జిల్లా అభివృద్ధి ప్రస్థానంపై జర్నలిస్టులు, కవులు, రచయితలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు, విద్యావేత్తలు తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా వేదికలు, సదస్సులు నిర్వహించాలని సూచించారు.

అన్ని వర్గాల భాగస్వామ్యం… పండుగలా నిర్వహణ

సిద్ధిపేట జిల్లా ఆవిర్భావ దినోత్సవమైన 2026 అక్టోబర్‌ 11 వ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారిక కార్యక్రమంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో ఒక మహా పండుగలా నిర్వహించాలని హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, చరిత్ర, అభివృద్ధి ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించి సిద్ధిపేట ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింతగా చాటాలని అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సూడా మాజీ ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు గుండు భూపేశ్ తదితరులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, న్యాయవాదులు, వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ ప్రతినిధులు, వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News