మోదీ, అమిత్ షా ఒత్తిడితో రాజ్యాంగానికి ద్రోహం
బూత్ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం
అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ పోనివ్వం
సీఈసీ నుంచి జ్ఞానేశ్వర్‌ను తొలగించి, అరెస్ట్ చేసి విచారించేవరకు పోరాటం
డిసిసి అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్
ఇండియా కూటమి అద్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన.. కలెక్టర్ కు వినతి
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 06: “ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బూత్ స్థాయి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. అర్హులైన ఏ ఒక్క ఓటరుకు అన్యాయం జరగకుండా పోరాటం సాగిస్తామని డిసిసి అధ్యక్షులు రెడ్డి పల్లి ఆంజనేయులు గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ లు స్పష్టం చేశారు.మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట సిఈసి జ్ఞానేశ్వర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి అద్వర్యంలో ఆందోళన చేపట్టారు.అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణే లక్ష్యంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు.రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడితో రాజ్యాంగ సంస్థల స్వతంత్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు వేసే అవకాశం కల్పించడం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితాలపై ప్రజల్లో అనుమానాలు తలెత్తినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందన్నారు. ఓటు హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనైనా ప్రజాస్వామ్య పరిరక్షణ కోణంలో ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయబోమని రోహిత్ రావు స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు, బూత్ స్థాయిలో ప్రజలను చైతన్యపరచడంతో పాటు, అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాల్లో ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని, ఏవైనా తప్పులు గుర్తిస్తే చట్టబద్ధమైన మార్గాల్లో సరిదిద్దుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు.
ఓటు హక్కు అనేది కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే పరిమితం కాదని, ప్రజాస్వామ్యంలో పౌరుడి భాగస్వామ్యానికి అది పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఓటరుకు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలన్నదే తమ పోరాట లక్ష్యమన్నారు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన వ్యవహారంలో జ్ఞానేశ్వర్ పాత్రపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేతలు ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, అరెస్ట్ చేసి విచారించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ అంశంలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఆరోపణలపై సంబంధిత సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, వివరాల్లో తప్పులు ఉండటం వంటి సమస్యలను అర్హులైన పౌరులు నిర్లక్ష్యం చేయకూడదని వారు సూచించారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారులను సంప్రదించి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడతామన్నారు.ఓటు హక్కును కాపాడుకోవడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమేనని,ఓటు బచావో.. దేశ్ బచావో ఉద్యమాన్ని బూత్ స్థాయి నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల సంరక్షణ అంశాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి రాజు యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఆవుల గోపాల్ రెడ్డి, మల్లప్ప యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పరుశరామ్ గౌడ్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ కాంగ్రెస్ నాయకులు రాగి అశోక్, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్ గౌడ్, మహేందర్ రెడ్డి, సిపిఎం నాయకులు మల్లేశం, బాలమణి, షౌకత్ అలీ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
































